ఫొటోలో గల పోలీస్ పేరు ప్రీత్ పాల్ సింగ్. పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ ప్రాంత స్టేషన్ కు చెందిన జవాను. ఛండీగఢ్ కు ఫతేగఢ్ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లెండి. అయితే ఏంటీ అంటారా? అక్కడే ఉంది అసలు కథ. యూనిఫాంలో గల ప్రీత్ పాల్ సింగ్ రోడ్డుపైనే ఉండగా ఓ కోడిగుడ్ల రిక్షా అక్కడికి వచ్చింది. రిక్షాను తీసుకువచ్చిన వ్యక్తి దాన్ని రోడ్డుపక్కన నిలిపి ఏదో పనిమీద పక్కకు వెళ్లాడు. ఇంకేముంది మన హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ తన చోరకళను ప్రదర్శిస్తూ చేతులకు పని కల్పించాడు. తనను ఎవరూ చూడడం లేదనుకున్నాడో ఏమో…. అటూ, ఇటూ చూస్తూనే అదును చూసి కోడిగుడ్లను తస్కరించి జేబులో వేసుకున్నాడు. ఇలా రెండుసార్లు ట్రేల్లో గల కొన్ని గుడ్లను జేబులోకి నెట్టేశాడు. ఈలోగా రిక్షాను నిలిపిన వ్యక్తి తిరిగి రావడంతో అప్రమత్తమైన హెడ్డుగారు ఎదురుగా వస్తున్న ఆటోను ఆపి వెళ్లిపోయాడు. అయితే తన కోడిగుడ్లు చోరీకి గురైనట్లు రిక్షా తీసుకువచ్చిన వ్యక్తి కనిపెట్టినట్లే కనిపిస్తోంది. హెడ్ కానిస్టేబుల్ వెళ్లిపోగానే రిక్షాకు చెందిన వ్యక్తి ఎవరికో చేయి చూపుతూ సైగలు చేయడం గమనార్హం.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ కోడిగుడ్లను చోరీ చేసిన హెడ్ కానిస్టేబుల్ ప్రీత్ పాల్ సింగ్ ఘనకార్యాన్ని మాత్రం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముది హెడ్డుగారి చోరకళ తాలూకు వీడియో చక్కర్లు కొడుతూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ప్రీత్ పాల్ సింగ్ పై సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన విచారణ జరుపుతున్నారు. హెడ్డుగారి గుడ్ల చోరీ కథకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దిగువన మీరూ చూసేయండి.