కల్లోల పరిణామాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.
అయినప్పటికీ కరోనా సోకిన ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో డాక్టర్లు ఏ మాత్రం రాజీ పడడం లేదు. ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ వరుస నుంచి వెనుకంజ కూడా వేయడం లేదు. ఈ అంశంలో దేశవ్యాప్తంగా వైద్యసిబ్బంది సేవలపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లోనూ ఓ వైద్యుడి నిర్వాకానికి సంబంధించిన వీడియోను చూపించక తప్పడం లేదంటోంది ఛత్తీస్ గఢ్ కు చెందిన ‘బస్తర్ కీ ఆవాజ్’ అనే మీడియా సంస్థ. ప్రజల ప్రాణ రక్షణే పరమావధిగా పనిచేస్తూ దేశ ప్రజల నుంచి వైద్యులు జేజేలు అందుకుంటున్న పరిస్థితుల్లోనూ ఈ వీడియోను చూపడం అనివార్యమైందని ‘బస్తర్ కీ ఆవాజ్’ తన వార్తా కథనంలో వివరణ కూడా ఇచ్చుకోవడం గమనార్హం.
ఆయా మీడియా సంస్థ కథనం ప్రకారం… ఈ వీడియోలో కనిపిస్తున్న వైద్యుని పేరును కబీర్ సింగ్ గా పేర్కొంటూ, అది ‘సినిమా’ కాదు అని ‘బస్తర్ కీ ఆవాజ్’ వ్యాఖ్యానించింది. దంతెవాడ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఇతను. ఫూటుగా తాగి ఆసుపత్రి విధులకు హాజరయ్యాడు.
తాగిన మత్తులో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి చికిత్స చేశాడు. రోగి ప్రాణం పోయింది. దీంతో డాక్టర్ కు కాస్త మత్తు దిగినట్లు అనిపించింది. బాధిత కుటుంబం బావురుమంది. సదరు డాక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
డాక్టర్ ‘కబీర్ సింగ్’ మద్యం సేవించి ఉండకపోతే తమ కుటుంబ సభ్యుని ప్రాణం దక్కి ఉండేదని కన్నీటి పర్యంతమైంది. పీకలదాకా మందు కొట్టి, తాగిన మైకంలో వైద్యం అందించడం ద్వారా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోవడానికి కారణమైన ఈ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా ఇది డాక్టర్ నిర్లక్ష్యమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని దంతెవాడ జెడ్పీ సీఈవో మీడియాతో చెప్పారు.
ఫుల్లుగా తాగిన డాక్టర్ తూలుతూ, తడబడుతూ మాట్లాడుతున్న ఈ డాక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిగువన మీరూ చూసేయండి మరి.