పెద్దల సభ (Upper House)లో సభ్యులు పెద్దలుగానే వ్యవహరించాలని అనేక సందర్భాల్లో పలువురు ప్రముఖులు చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఓ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. లోక్ సభలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, పెద్దల సభ (రాజ్య సభలో) కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడంతో బిల్లులు పాస్ కావడం ఇబ్బందిగా ఉండేది. లోక్ సభలో పాసయినా, రాజ్యసభ పాస్ చేయకపోవడంతో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలోనే ‘పెద్దల సభ’ సభ్యులు పెద్ద మనసుతో ప్రజాస్వామ్య తీర్పును గౌరవించాలని వెంకయ్య నాయుడు సూచన చేశారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి తగినన్ని స్థానాలు లేనంత మాత్రాన పెద్దల సభలో ఆధిక్యం ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదనేది వెంకయ్యనాయుడి సలహా. విజ్ఞులైన వారెవరైనా ఇలాంటి సలహానే ఇస్తారు. పెద్దలు ప్రజల తీర్పును అపహాస్యం చేయకూడదు.
ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్దల సభ (శాసన మండలి – ఎమ్మెల్సీల సభ) కూడా అర్ధం చేసుకోవాలి. రాజకీయ పార్టీ నిర్ణయాల ప్రకారం పెద్దలు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ బిల్లులను తిప్పికొడితే ఫలితాలు వేరుగానే ఉంటాయి. 1985లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పటికీ పెద్దల సభ (శాసన మండలి) లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏకంగా శాసనమండలినే రద్దు చేశారు. ఆ తర్వాత 2007లో వైఎస్సార్ మళ్ళీ శాసన మండలిని పునరుద్ధరించారు.
ఇప్పుడు శాసనసభలో ప్రభుత్వానికి తిరుగులేని ఆధిక్యం ఉన్నప్పటికీ, శాసన మండలిలో ఆధిక్యంలో గల టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, బిల్లులు తిరస్కరించడం సమర్ధనీయం కాదు. పెద్దలు ఇలా ప్రవర్తిస్తే, ప్రభుత్వాధినేతలు ఎన్టీఆర్ మాదిరిగా ప్రవర్తించాల్సి వస్తుంది.
పెద్దలు ప్రజా తీర్పును గౌరవించాలి. తమ గౌరవాన్ని కాపాడుకోవాలి. రాజకీయాలు సభ బయట చూసుకోవాలి. లేదంటే మళ్ళీ ఎన్టీఆర్ నిర్ణయమే. మళ్ళీ 1985 చరిత్రే… పెద్దలు ఇంటికే…!
-దారా గోపి