కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసే పెళ్లిళ్లు సంబంధిత కుటుంబాల ఆర్థిక దర్పానికి మాత్రమే నిదర్శనంగా మిగులుతాయి. ప్రత్యేక విమానాల్లో విదేశాలకు బంధువులను, వీఐపీ అతిథులను తరలించడం, పెళ్లికి వెళ్లిన వారికి విలువైన గిఫ్టులు ఇవ్వడం, బంగారంతో తయారు చేసిన పెళ్లి పత్రికలను పంచడం, ఈ సందర్భంగా ఖరీదైన పట్టుచీరలను ఇచ్చి మరీ పెళ్లికి పిలవడం వంటి దృశ్యాలు పెద్దోళ్ల ఇళ్లల్లో పెళ్లి ఆడంబరాలకు ప్రతీకగా భావిస్తుంటారు. ఇంకొందరు సముద్ర దీవుల్లో పెళ్లిళ్లు చేసుకుని తమ ప్రత్యేకతను చాటుకుంటారు. పెళ్లి తంతుకు ముందు, తర్వాత సినీ తారలతో సంగీత కచేరీలు కూడా నిర్వహిస్తుంటారు. ఎవరి ఇష్టం వారిది. ఎవరి సంస్కృతి వారిది. డబ్బున్నవారి పెళ్లిళ్లకు సంబంధించి ఇటువంటి అనేక ప్రత్యేకతలు ఉంటాయి. తరచుగా చూస్తుంటాం…వింటుంటాం.
సాధారణ కుటుంబాల్లో పెళ్లయిన కొత్త జంటకు ఊరేగింపు నిర్వహించే సందర్భంగా పల్లకిని, కార్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుత కాలంలో పల్లకీల జాడ అత్యంత అరుదుగా కనిపిస్తోందనేది వేరే విషయం. కానీ ఇందులోనూ ప్రత్యేకత ఏముంది? అందరిలాగానే ఊరేగింపు నిర్వహిస్తే వాళ్ల పెళ్లి గురించి చర్చించుకునేదెవరు? సాధారణ ఊరేగింపుల్లో చెప్పుకోవడానికి విశేషం, ప్రత్యేకత ఏముంటుంది? అందుకే కాబోలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన ఓ పెళ్లి జంట తమ ఊరేగింపును వెరైటీగా నిర్వహింపజేసుకున్నారు. వెంటాపూర్ కు చెందిన శశాంక్, మ్యాదరిపేటకు చెందిన వర్షిణిలకు శుక్రవారం వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఓ జేసీబీని పూలతో అందంగా అలంకరించి ఇదిగో ఇలా కొత్త జంటను ఊరేగించారు. అదీ ప్రత్యేకత అంటే.. అదిరింది కదూ… షాన్ దార్ కా బాప్.. ఈ షాదీ బరాత్!