షాపింగ్ మాల్స్ వ్యవహార శైలికి షాక్ నిస్తూ వెలువడిన తీర్పు ఇది. వినియోగదారుల నుంచి ఎటువంటి నగదును వసూలు చేయకుండా క్యారీ బ్యాగ్స్ ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. ఈమేరకు వినియోగదారులకు ఉచితంగా క్యారీ బ్యాగ్స్ ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-3 సంచలన తీర్పు చెప్పింది. వినియోగదారుని వద్ద క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన రూ. 3.50 మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారం కింద రూ. 1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించిస్తూ వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెడితే…

హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన భగేల్కర్‌ ఆకాష్ కుమార్‌ అనే వ్యక్తి 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో సరుకులు కొనుగోలు చేశారు. ఇందుకు బిల్లు రూ.602.70 కాగా, సరుకులతోపాటు ఇచ్చిన ప్లాస్టిక్‌ బ్యాగుకు రూ.3.50 వసూలు చేశారు. సంస్థ పేరు ముద్రించినప్పటికీ తన వద్ద నగదు వసూలు చేశారని ఆకాష్ కుమార్ వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన డీ మార్ట్ నిర్వాహకులు ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2011 ప్రకారం చేతి సంచులు ఉచితంగా ఇవ్వకూడదని సూచిస్తోందని తెలిపారు.

అయితే 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు క్యారీ బ్యాగులు ఫ్రీ గా ఇవ్వాలని సూచించినట్లు బెంచ్‌ పేర్కొంది. పాత నిబంధనలను చూపుతూ వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేయడం సబబు కాదని, ఇది సేవల్లో లోపమే కాకుండా వినియోగదారులను దోచుకోవడమేనని పేర్కొంది. ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే క్యారీ బ్యాగ్స్‌ ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది.

ఇక నుంచి ఏ షాపైనా ఎటువంటి క్యారీ బ్యాగులకు డబ్బు వసూలు చేయవద్దని కూడా కమిషన్ ఆదేశించింది. నలభై అయిదు రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

Comments are closed.

Exit mobile version