తుపాకీ వెంకటకృష్ణ! – 2
‘ఒకప్పుడు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బియ్యం దొరికేవి కాదు.. ఇప్పటికీ తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పండక్కి ఒడిబియ్యం పడతారు. అదేంటో తెలుసా? ఎప్పుడు బియ్యం తినని కుటుంబాలు కాబట్టి. ఆ రోజు కూతుర్ని, అల్లుడ్ని ఇంటికి పిలిచి, తెల్లబియ్యం పెడితే.. అది పండగ చేసుకోవడం అన్నమాట. అప్పట్లో వాళ్లు ఏం తిన్నరంటే రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇవే తిన్నారు’
సాధారణ కంట్రిబ్యూటర్ నుంచి ఓ న్యూస్ ఛానల్ సీఈవో స్థాయికి ఎదిగిన జర్నలిస్టు వెంకటకృష్ణ కొద్ది నెలల క్రితం తెలంగాణా ఆడబిడ్డల సంప్రదాయంపై చేసిన ఆయా వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దబాయించడం, తానూ ఆ ప్రాంతవాసినేనని, తనకు తెలుసని తాను నిర్వహించే డిబేట్లలో పాల్గొన్నవారిని కంట్రోల్ చేయడంలో వెంకటకృష్ణది ప్రత్యేక శైలి. తాను ఏ ఛానల్లో పనిచేసినా తాను నిర్వహించే డిబేట్లలో వెంకటకృష్ణ వ్యవహార తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది వేరే విషయం. ఇక అసలు విషయంలోకి వెడదాం..
గోవిందరావుపేటలో పనిచేసిన కొందరు విలేకరులు మాత్రమే ఫణిబాగ్చి గ్రూపు నక్సల్స్ కు ఎందుకు టార్గెట్ అయ్యారనే విషయాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ఇందులో ఆరోపణలకు సంబంధించి వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, జరిగిన సంఘటనలను మాత్రం ప్రస్తావించక తప్పదు. ఫణిబాగ్చి, రామచంద్రన్ నక్సల్ గ్రూపుల మధ్య అధిపత్య, వర్గపోరు తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలోనే ములుగు మండలం జగ్గన్నగూడెం సమీపంలోని పెద్దపులి గుట్ట వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పుల ఘటన జరిగింది. ఇందులో ఫణిబాగ్చి గ్రూపు అగ్రనేత సామా అంతిరెడ్డి అలియాస్ సత్తెన్న భార్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పూలక్క చనిపోయారు. వాస్తవానికి పూలక్క లీగల్ కార్యకలాపాలు నిర్వహించే నాయకురాలు మాత్రమే. సాయుధ నక్సల్ లీడర్ కాదు. ఆమె బహిరంగంగానే సంచరించేవారు.
ఈ ఎన్కౌంటర్ ఘటన అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విప్లవ కార్యకలాపాల్లో కీలక మలుపునకు దారి తీసిందని ప్రస్తావించకతప్పదు. పూలక్క ఎన్కౌంటర్ వెనుక గోవిందరావుపేటకు చెందిన ఓ సామాజికవర్గం కుట్ర దాగి ఉందని, అందులో కొందరు విలేకరుల పాత్ర కూడా ఉందని ఫణిబాగ్చి గ్రూపు ఆరోపణలు చేసింది. అప్పట్లో ములుగు ఏఎస్పీగా విధుల్లో గల ఓ ఐపీఎస్ అధికారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని గోవిందరావుపేటకు చెందిన ఇద్దరు విలేకరులతోపాటు మరో వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించారని, ఫలితంగానే పూలక్కను కోల్పోవలసి వచ్చిందన్నది ఫణిబాగ్చి గ్రూపు ఆరోపణల సారాంశం. ఫణిబాగ్చి గ్రూపు కార్యకలాపాలను పూర్తిగా నిరోధించేందుకు ఓ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు విలేకరులు లోతైన కుట్ర చేశారని ఆ గ్రూపు తీవ్ర ఆరోపణలు చేయడమేకాదు, వారిని టార్గెట్ చేస్తూ ప్రకటనలు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే గోవిందరావుపేటలో ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న విలేకరి ప్రాణభయంతో తన మకాంను హన్మకొండకు మార్చారు. కానీ పోలీస్ ఇన్ఫార్మర్లుగా ప్రకటించిన ఈ ఇద్దరు విలేకరుల కదలికలపై ఫణిబాగ్చి గ్రూపు నక్సల్స్ మాత్రం డేగ కన్నే వేశారు. అదును చిక్కిందే తడవుగా హన్మకొండ రెడ్డి కాలనీలో గల ఓ విలేకరి ఇంటి నుంచి శ్రీహరి అనే మాజీ విలేకరిని ఫణిబాగ్చి నక్సల్స్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ నకు గురైన శ్రీహరి గోవిందరావుపేట కేంద్రంగా ఉదయం పత్రికకు విలేకరిగా పనిచేసి, అటవీ శాఖలో ఉద్యోగిగా నియామకమైన కొద్దిరోజులకే కిడ్నాప్ కావడం గమనార్హం. పోలీస్ ఇన్ఫార్మర్లుగా ఫణిబాగ్చి గ్రూపు నక్సల్స్ ప్రకటించిన ఇద్దరు విలేకరుల్లో శ్రీహరి కూడా ఒకరు. ఇతని ప్రాణాన్ని కాపాడే లక్ష్యంతో అటవీశాఖలో ఉద్యోగి అయినప్పటికీ, శ్రీహరి తమ పత్రికలో ఇంకా విలేకరిగానే ఉన్నారని ఉదయం యాజమాన్యం కిడ్నాప్ సందర్భంగా ప్రకటించింది.
అయితే ఇప్పటి మాదిరిగా అప్పట్లో సమాచార వ్యవస్థ లేకపోవడంతో ఉదయం పత్రిక యాజమాన్యం ప్రకటన తమకు చేరేలోపే శ్రీహరిని నక్సల్స్ కాల్చి చంపారు. గోవిందరావుపేటలోని పూలక్క స్మారక స్తూపం వద్దే శ్రీహరిని చంపాలని నిర్ణయించుకున్న నక్సల్స్, అదే సమయంలో సెకండ్ షో సినిమా విడుదల కావడంతో దుంపెల్లిగూడెం మార్గంలో అతన్ని కాల్చి చంపారు. శ్రీహరిని కిడ్నాప్ చేసిన సందర్భంగానే మరో విలేకరిని కూడా నక్సల్స్ కిడ్నాప్ చేయాల్సి ఉందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఆ సమయంలో అతను బయటకు వెళ్లడంతో శ్రీహరి మాత్రమే నక్సల్స్ కు చిక్కారు. ఈ ఉదంతంతో తనను కూడా చంపుతారనే భయంతో సదరు విలేకరి జర్నలిస్టు సంఘాల ద్వారా నక్సల్స్ ను కన్విన్స్ చేసేందుకు, వారితో రాజీ కుదుర్చుకునేందుకు విఫలయత్నం చేశారు. అతని విషయంలో ఫణిబాగ్చి నక్సల్స్ జర్నలిస్టు సంఘాల నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ‘టార్గెట్’ తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. సరే…చివరికెలాగోలా ఆయా విలేకరి ఫణిబాగ్చి నక్సల్ నేతల కాళ్లా వేళ్లా పడి, బతుకు జీవుడా అంటూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నాడనేది అప్పటి విప్లవోద్యమ కార్యకలాపాల్లోని చరిత్ర.
ఇక వెంకటకృష్ణ తీవ్రవాద ఉద్యమ నేపథ్యంలోకి వద్దాం. ఉదయం విలేకరిగా పనిచేసిన శ్రీహరి హత్య, ఈనాడులో పనిచేసిన మరో విలేకరి గోవిందరావుపేట నుంచి మకాం మార్చి హన్మకొండకు, అనంతర పరిణామాల్లో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో గోవిందరావుపేట కేంద్రంలో ‘ఈనాడు’ పత్రికకు కంట్రిబ్యూటర్ గా వెంకటకృష్ణ జాయినయ్యారు. అయితే కొంత కాలం తర్వాత వెంకటకృష్ణ కూడా గోవిందరావుపేట నుంచి హన్మకొండకు మకాం మార్చారు. గోవిందరావుపేట నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో గల వరంగల్ జిల్లా కేంద్రానికి వెంకటకృష్ణ మకాం మార్చడానికి వృత్తిపరంగా ఎటువంటి ఎలివేషన్ కూడా రాలేదు. పదోన్నతీ లభించకపోవడం గమనార్హం. తొలుత నయీంనగర్, తర్వాత కార్పొరేషన్, అనంతరం హన్మకొండ కేంద్రాలకు కంట్రిబ్యూటర్ స్థాయిలోనే వెంకటకృష్ణ విలేకరిగా పనిచేశారు. ఆ తర్వాత కొంత కాలానికి ఈటీవీ ప్రారంభం కావడం, అందులో నేరుగా స్టాఫర్ గా వెంకటకృష్ణ తన జర్నలిజపు కెరీర్ ను సాగించినట్లు చరిత్ర చెబుతోంది.
కానీ తాను వామపక్ష ఉద్యమంలో పాల్గొన్నానని, తీవ్రవాదంలో పాలు పంచుకున్నానని, రెండు, మూడు మేజర్ ఘటనల్లో మిస్సయ్యానని, చావు తప్పి…బయటపడ్డానని వెంకటకృష్ణ స్వయంగా తాను పనిచేస్తున్న ఛానల్లోనే బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇంతకీ వెంకటకృష్ణ పనిచేసింది రామచంద్రన్ నక్సల్ గ్రూపులోనేనా? ఇదే నిజమైతే వెంకటకృష్ణ తమ పార్టీ సానుభూతిపరుడనిగాని, దళసభ్యుడనిగాని, నాయకుడనిగాని రామచంద్రన్ గ్రూపు నక్సల్ నేతలెవరూ క్లెయిమ్ చేసుకున్న దాఖలాలు లేవు. అనంతర పరిణామాల్లో రామచంద్రన్ గ్రూపు నుంచి విడిపోయి జనశక్తి స్థాపించిన కూర రాజన్న అలియాస్ కేఆర్ మాత్రమే వెంకటకృష్ణ తీవ్రవాద ఉద్యమ నేపథ్యాన్ని ప్రకటించాల్సి ఉంది. లేదంటే వెంకటకృష్ణే తన తీవ్రవాద ఉద్యమ నేపథ్యాన్ని విపులంగా వివరించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే అనేక సందేహాలు కూడా ఉన్నాయి. అసలు వెంకటకృష్ణ కంట్రిబ్యూటర్ స్థాయిలోనే గోవిందరావుపేట నుంచి హన్మకొండకు అకస్మాత్తుగా ఎందుకు మకాం మార్చాల్సి వచ్చింది? కేవలం కెరీర్ డెవలప్మెంట్ కోసమేనా? లేక ఫణిబాగ్చి గ్రూపు నక్సల్స్ టార్గెట్ చేశారా? చేస్తే ఎందుకు చేశారు? ఫణిబాగ్చి గ్రూపు అగ్రనేత ప్రసాదన్న వెంకటకృష్ణ వ్యవహారశైలిపై ఈనాడు వ్యవస్థలోని జిల్లా స్థాయి స్టాఫర్ కు, జర్నలిస్టు సంఘాల నేతలకు అప్పట్లో ఏదేని లేఖ రాశారా? ఫలితంగా జరిగిన చర్చల పరిణామాల్లోనే వెంకటకృష్ణకు ఈనాడు యాజమాన్యం హన్మకొండలో నయీంనగర్ వంటి చిన్న డేట్ లైన్ ను కేటాయిస్తూ విలేకరిగా కొనసాగించిందా? ఇటువంటి అనేక ప్రశ్నలకు వెంకటకృష్ణ జవాబు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే తన స్వయం ప్రకటిత తీవ్రవాద ఉద్యమ నేపథ్యాన్ని ప్రజలకు, కనీసం తాను బాధ్యతలు నిర్వహిస్తున్న ఛానల్ ప్రేక్షకులకైనా వివరించాల్సి ఉంది. లేదంటే వెంకటకృష్ణ తీవ్రవాద ఉద్యమ నేపథ్యపు లోగుట్టు అప్పటి ఫణిబాగ్చి గ్రూపు నేత ప్రసాదన్నకే తెలుసని భావించక తప్పదు. ఏమంటావ్… మిస్టర్ వెంకటకృష్ణా? ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది… ఇది మీ స్లోగనే అనుకుంటా.