ఏమో అనుకుంటాం గాని, కొందరు జర్నలిస్టులకు దివ్యదృష్టి ఎక్కువే సుమీ. అది ఎంతలా అంటే… మనం కలలో కూడా ఊహించనంత అద్భుత శక్తిని ఆయా జర్నలిస్టులు కలిగి ఉంటారు. ఇదీ మరీ అతిశయోక్తి అని భావిస్తే మాత్రం కొందరు జర్నలిస్టులు అస్సలు అంగీకరించకపోవచ్చు. పెద్దపులులను సైతం అటవీ అధికారులు పెంపుడు పిల్లుల్లాగా భావించి తెలంగాణా అడవుల్లో వదిలేసినట్లున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పోడు భూములను కాపాడుకునేందుకు అటవీ అధికారులు పెద్దపులుల శరణు వేడి, వాటిని తీసుకువచ్చి అడవుల్లో వదిలేసినట్లున్నారు. సరిగ్గా ఇలాంటి భావననే కలిగిస్తూ, ‘ఫారెస్టోళ్లు’ వదిలేసిన పెద్దపులులు పోడు భూముల చుట్టూ తిరుగుతున్నాయని పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామికి చెందిన ‘వెలుగు’ పత్రిక ప్రచురించిన సంచలనాత్మక వార్తా కథనపు సారాంశం. భలేగా ఉంది కదూ ఈ పరిశోధనాత్మక జర్నలిజం!
తెలంగాణాలో సంచరిస్తున్న పెద్దపులులు (సంఖ్యపై అటవీ అధికారులకే క్లారిటీ లేదు) ఇప్పటికే ఇద్దరు మనుషులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ పెద్ద పులి కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల వరకు సంచరిస్తున్నట్లు దాని పాదముద్రలు చెబుతున్నాయి. మరోవైపు ఇదే పులి పాదముద్ర ఆనవాళ్లు గోదావరికి అవతలి ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దు జిల్లాల్లోనూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాలకు చెందిన పలు జిల్లాల ప్రజలను ఈ పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనేది వాస్తవం. ప్రజలు పొలం పనులకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. వ్యవసాయ కూలీలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సరే.., ఇంతకీ దశాబ్ధాలుగా జాడ లేని తెలంగాణా అడవుల్లోకి అకస్మాత్తుగా పులి ఎందుకు ప్రవేశించింది. ఇదీ అసలు సందేహం. వాస్తవానికి పులులకు సరిపడా ఆహారం అడవుల్లో లేదనేది అటవీ అధికారులు చేస్తున్న తాజా వాదన. వారి లెక్కల ప్రకారం కాగజ్ నగర్ అడవుల్లో గల 12 పెద్దపులుల ఆకలిని తీర్చడానికి నాలుగు నుంచి ఏడు వేల వరకు శాఖాహార జంతువులు కావాలట. అంటే దుప్పులు, జింకలు, అడవిదున్నల వంటి వన్యప్రాణుల అవసరం ఉందన్నమాట. కానీ ప్రస్తుతం 2,700 వరకు మాత్రమే శాఖాహార జంతువులు ఆయా అడవుల్లో ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అటవీ అధికారులు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో గల జూపార్కుల, వనవిహార్ ల నుంచి దుప్పులను తీసుకువెళ్లి కాగజ్ నగర్ అడవుల్లో వదిలేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే పెద్దపులి సంచారంపై అటవీ అధికారులు తమ పాట్లేవో తాము పడుతున్నారు.
ఇంతకీ తెలంగాణా అడవుల్లో పులుల జాడ ఎందుకు కనిపిస్తోందనే ప్రశ్నకు వస్తే… అటవీ అధికారులు చెబుతున్న వాదన మరోలా ఉంది. హరితహారం పేరుతో అడవుల పెంపకంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే. కలప స్మగ్గింగ్ కు పాల్పడుతున్నవారిపై పీడీ యాక్డు నమోదు చేయాలనే ఆదేశాలు కూడా సర్కార్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ వంటి ప్రాంతాల్లో గడచిన అయిదేళ్లలో అడవుల సంరక్షణ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్లి ‘పొయ్యిల కట్టెలు’ తీసుకురావడానికి కూడా అటవీ అధికారులు అనుమతించలేదు. తెలంగాణా పల్లెల్లో పెళ్లిళ్లకు పందిళ్లలో విరివిగా వాడే ‘పాల పొరుక’కు కూడా అటవీ అధికారులు అనుమతించలేదు. విధినిర్వహణలో చిత్తశుద్ధి గల అటవీ అధికారుల కృషి ఫలితంగా ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెరగడమే కాదు, బాగా చిక్కబడింది కూడా. అంటే చిట్టడవులు సైతం కీకారణ్యాలుగా మారాయి. దీంతో సహజంగానే పులులకు ‘ఆవాస’ ప్రాంత విస్తీర్ణం పెరిగింది. నిశ్శబ్ధ వాతావరణం అలుముకున్న కొద్దీ వన్యప్రాణుల కదలికలూ పెరుగుతాయనేది తెలిసిన విషయమే. మారిన తెలంగాణాలోని కీకారణ్య వాతావరణమే మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి పులుల రాకకు అనువుగా మారిందని వైల్డ్ లైఫ్ విభాగపు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే అంశంపై వన్యప్రాణి విభాగపు విజిలెన్స్ డీఎఫ్ వో రాజా రమణారెడ్డి మాట్లాడుతూ… ‘వాస్తవానికి మన పులులు మ్యాన్ ఈటర్స్ కాదు. మనుషులు కూర్చుని ఏదో పనిచేసుకుంటున్న సమయంలో వారి ఆకారం ఏదో చిన్న ప్రాణిగా పులులకు గోచరిస్తుంది. పులి బారిన పడిన ఇద్దరు వ్యక్తుల సంఘటనలు కూడా ఇదే తరహాలో జరిగాయి.’ అని అన్నారు. అడవులు పెరగడం వల్లే పులుల ఉనికి కనిపిస్తోందని రాజా రమణారెడ్డి స్పష్టం చేశారు. అటవీ అధికారుల వాదన ఇలా ఉండగా, వెలుగు పత్రిక మాత్రం పులుల జాడను తనదైన శైలిలో కనిపెట్టడమే అసలు విశేషం. ఆ పత్రిక కథనం ప్రకారం… అటవీ అధికారులు వదిలేసిన పులులు పోడు భూముల చుట్టే తిరుగుతున్నాయ్. అడవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించాయి. అటవీ భూముల్లోకి ఎవరూ వెళ్లకుండా ఆ శాఖ అధికారులే పులులను వదిలేశారని గిరిజనుల భుజంపై కలం పెట్టి మరీ ఆ పత్రిక ఈ వార్తా కథనాన్ని వండి వడ్డించడం విశేషం. అయితే ఈ పులులను అటవీ అధికారులు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే ప్రశ్నకు మాత్రం ఆయా వార్తా కథనంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఇటువంటి వార్తా కథనాలను చదివే పాఠకుడే అటువంటి పత్రికలకు లోకువ కాబట్టి. అడవుల రక్షణ కోసం కేసీఆర్ సర్కార్ అనవసరంగా అటవీ శాఖను నిర్వహిస్తోందిగాని, మరో పది పులులను అడవుల్లోకి వదిలేస్తే సరిపోయేదేమో! సర్కార్ కు రొక్కం మిగిలి, అడవికి చేవ దక్కేది… ఆలోచించాల్సిన విషయమే కదా!