రాజకీయాల్లోవిమర్శలు, ప్రతి విమర్శలు సహజం. సైద్ధాంతికంగా, రాజకీయంగా ఈ విమర్శలు సాగినపుడు భవిష్యత్ రాజకీయాల దారిలో నాయకులు సునాయసంగా పయనించే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా విమర్శల దాడి చేస్తే, ఆ తర్వాత పరిస్థితులు తలకిందులై తెగిడిన నేత పార్టీలో చేరి పొగడాల్సి వస్తేనే పరిస్థతి దయనీయంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ ను ఎడా పెడా విమర్శించిన వారిలో అనేక మంది ప్రస్తుతం ఆయన కేబినెట్లోనే ఉన్నారు. అది వేరే విషయం. కానీ పొరుగున గల ఏపీలో జగన్మోహన్ రెడ్డిపై రాజకీయంగానేగాక వ్యక్తిగతంగానూ పరుష పదజాలంతో దాడి చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ వంశీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలోని సారాంశం ప్రకారం…తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి రెండుసార్లు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్జతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ హయాంలో ఎక్కువగా నెరవేర్చినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అతికష్టం మీద విజయం సాధించాల్సి వచ్చిందని, ఎన్నికల తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టాయని, తనను రాజకీయంగా వేధిస్తున్నారని, అనుచరులపై కేసులు పెడుతున్నారని వంశీ తన లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొంటూ, ఆయా కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ స్పష్టం చేశారు.
అయితే వంశీ రాజీనామా లేఖలో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొనడం. అంటే వంశీ ఇక రాజకీయ రంగానికి దూరంగా ఉంటారా? మరే రాజకీయ పార్టీలో చేరడం లేదా? వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్లు ఎందుకు ప్రకటించారు? ఇవీ సందేహాలు. అదేవిధంగా తాను వైసీపీలో చేరుతున్నట్లు కూడా వంశీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అధికార పార్టీలో చేరే యోచన లేకపోతే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం దేనికి? ఇది మరో ప్రశ్న. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే పదవులకు రాజీనామా చేయాలని జగన్ రూపొందించుకున్న ఫార్ములా ప్రకారమే వంశీ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. మంత్రులు పేర్ని నానా, కొడాలి నానిలతో కలిసి సీఎం జగన్ ను కలిసిన తర్వాతే తాజాగా వంశీ రాజీనామా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఓ వ్యూహం ప్రకారమే వంశీ రాజీనామా లేఖ ఉందనే అభిప్రాయాలను ఏపీ రాజకీయ పరిశీలక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వంశీ వైసీపీలో చేరడం లాంఛనప్రాయమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో వైఎస్ జగన్ పై వంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే…‘మీకు ఇంగ్లీష్ చదవటం రాదా? మీరెట్లాగూ జైలు పాలయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతిగారినన్నా జైలుకు వెళ్లకుండా, సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాలకు కోర్టుకు తిరక్కుండా, మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బావుంటుంది.’ అని వంశీ నిరుడు ఏప్రిల్ 25వ తేదీన జగన్ పై ధ్వజమెత్తారు. గన్నవరం నియోజకవర్గంలోని బ్రహ్మలింగయ్య చెరువు పనుల్లో అవినీతి జరిగిందని అప్పటి విపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలపై వంశీ స్పందిస్తూ ఆయా వ్యాఖ్యలు చేశారు. మరో సందర్భంలో వంశీ మాట్లాడుతూ, సాక్షి పత్రిక, టీవీ, భారతి సిమెంట్ సంస్థలు ప్రజల సొమ్ముతోనే ఏర్పాటయ్యాయని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి బాగా చదువుకున్నాడని, అపారమైన వ్యపార దక్షత గలవాడని ఆయనను నమ్మేవారు చెబుతారని, లంచాలు రాక, తన తండ్రి వైఎస్ చనిపోయాక జగన్ ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని కూడా వంశీ అన్నారు. అటువంటి పార్టీలో కడుపునకు అన్నం తిరేవారు ఎవరూ చేరరని, తాను ఖచ్చితంగా చెప్పగలనని, తాము అన్నమే తింటున్నామని, వాళ్లు అన్నం తింటున్నారో…లేదో వాళ్లే చెప్పాలని వంశీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేసిన పరిణామాల నేపథ్యంలోనే జగన్ పై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు అనేకం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. గతంలో తాను తీవ్ర వ్యాఖ్యలు చేసిన వంశీ దృష్టిలో ప్రస్తుతం జగన్ పరిశుద్ధుడైనట్లేనా? అనే ప్రశ్నలను కూడా రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా సంధిస్తున్నారు. వైసీపీలో చేరాక వంశీ జగన్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి ఏం చెబుతారో చూడాలి మరి.