ఒక్కోసారి మనకు అన్నీ అందుబాటులో ఉండవు. అవసరమైనవి అందుబాటులో లేకున్నా ఉన్నట్లు భ్రమిస్తూ టాస్క్ పూర్తి చేయాలి. ఎలా అంటారా? ఇదిగో ఉత్తరప్రదేశ్ పోలీసులను చూడండి ఎలా చేశారో? మాక్ డ్రిల్ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ కాళ్ల మధ్య లాఠీలతో గుర్రాల్లాగా దూసుకుపోతున్నట్లు పై చిత్రం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 16 సెకన్ల నిడివి గల పోలీసుల మాక్ డ్రిల్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ నెటిజన్లను ఊపేస్తోంది. అయోధ్య భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఒక రోజు ముందు అంటే ఈనెల 8న పోలీస్ కేడర్ ఫిరోజాబాద్ జిల్లాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం విశేషం.ఈ ఘటనపై అక్కడి ఇన్స్ పెక్టర్ రామ్ ఇక్షా మాట్లాడుతూ, తమకు గుర్రాలు అందుబాటులో లేవని, గుర్రాలపై ఉన్నట్లు భావిస్తూ తమ బలగాలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వెల్లడించారు.