తనపై 39 మంది సామూహిక అత్యాచారం చేసినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళ చేసిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే మహిళ చేసిన ఫిర్యాదు బూటకమని, చేసిన అప్పులు తీర్చాలన్నందుకు తప్పుడు ఆరోపణకు దిగి ఫిర్యాదు చేశారని గ్రామస్తులు పోలీసులను నిలదీస్తుండడమే ఇందుకు కారణం.
బాధితురాలి కథనం ప్రకారం ఆమె గ్రామానికే చెందిన ఛమన్, అమిత్, శంభు, పుష్పేంద్ర అనే నలుగురు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్లో అత్యాచారపు ఉదంతాన్ని వీడియో తీసి ఆమెను బెదిరిస్తూ, మరో 35 మందితో అత్యాచారం చేయించారు. తనపై అత్యాచారం చేసిన వ్యక్తుల్లో ఒకడైన అమిత్ తమ ఇంట్లో రూ. 50 వేల నగదును తస్కరించినట్లు కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈమేరకు పోలీసులు 39 మందిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలోనే పోలీసులకు అసలు సమస్య ఎదురైంది.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిన సదరు మహిళ భర్త మద్యానికి బానిసగా మారి, గ్రామంలోని అనేక మంది వద్ద తీరని అప్పులు చేశాడని గ్రామ పెద్ద అజయ్ కుమార్ ఓ వార్తా సంస్థకు చెప్పారు. తమవద్ద చేసిన రూ. 2.50 లక్షల అప్పు తీర్చాలని రుణదాతల నుంచి వత్తిడి పెరగడంతో, వారిపై పగబట్టిన దంపతులు అప్పులు ఇచ్చినవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నది గ్రామ పెద్ద అజయ్ కుమార్ వాదన. అందరి అప్పులు తమ అస్తులు అమ్మేసి తీరుస్తామని దంపతులు చెప్పారని, గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులు విక్రయించుకుని అప్పులు మాత్రం తీర్చలేదన్నారు. తమకు రావలసిన అప్పు మొత్తాల గురించి గొడవలు జరుగుతుండడడంతో పథకం ప్రకారం సదరు మహిళ అత్యాచారం ఫిర్యాదు చేసిందని అజయ్ కుమార్ పేర్కొన్నారు.
తప్పుడు ఫిర్యాదు చేసిన దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని బరేలీ ఎస్పీ శైలేష్ పాండేను గ్రామస్తులు కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, వాస్తవాల నిగ్గు తేలేవరకు నిందితులెవరినీ అరెస్ట్ చేయబోమని ఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే తాను అత్యాచారం కేసు పెట్టిన తర్వాత గ్రామస్తుల నుంచి తనకు వేధింపులు పెరిగాయని, ఊరు విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని బాధిత మహిళ మరోసారి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. మొత్తంగా పరస్పర ఆరోపణలతో ఈ కేసు బరేలీ పోలీసులకు తలనెప్పిగా పరిణమించింది.