చైనాకు అమెరికా గట్టి ‘షాక్’నిచ్చింది. చైనా దేశపు బయోటెక్ పై, నిఘా కంపెనీలపై, ప్రభుత్వ సంస్థలపై తాజాగా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం విశేషం. యుగుర్‌ ముస్లింలపై చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందనే ఆరోపణలు చేస్తూ అమెరికా ఇందుకు ఉపక్రమించడం గమనార్హం.

అమెరికా తాజా చర్యతో చైనా సంస్థలకు లైసెన్సు లేకుండా ఎలాంటి ఉపకరణాలను అగ్రరాజ్య కంపెనీలు విక్రయించకూడదు. చైనా సైన్యానికి మద్దతుగా బయోటెక్నాలజీని ఉపయోగిస్తున్న చైనా అకాడమీ ఆఫ్‌ మిలటరీ మెడికల్, సైన్సెస్‌ దానికి సంబంధించిన 11 పరిశోధన సంస్థలను అమెరికా వాణిజ్య శాఖ లక్ష్యంగా చేసుకుంటుండడం మరో విశేషం.

బయోటెక్, వైద్య ఆవిష్కరణలను ప్రజలపై నియంత్రణ, మతపరమైన మైనార్టీల అణచివేతకు చైనా ఉపయోగిస్తోందని అమెరికా వాణిజ్య శాఖ సెక్రటరీ గినా రైమాండో ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పథకం ప్రకారం యుగుర్లను అణచివేతకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు. అక్కడ బయోమెట్రిక్‌ ముఖ గుర్తింపు వ్యవస్థతో కూడిన అధునాతన నిఘా సాధనాలను డ్రాగన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12-65 ఏళ్ల మధ్య వయస్కుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించిందని కూడా పేర్కొన్నారు.

మరోవైపు షింజియాంగ్‌ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు అమెరికా సెనేట్‌ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేయడం లాంఛనప్రాయంగానే అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. 

Comments are closed.

Exit mobile version