ఆ తహశీల్దార్ అవినీతికి పాల్పడిన్నట్లు ప్రభుత్వ విజిలెన్స్ విభాగమే నివేదించింది. పేదల డబ్బుతో నిత్యం జేబు నింపుకునేందుకు బ్రోకర్లను నియమించుకుని ‘వసూల్ రాజా’గా మారినట్లు విజిలెన్స్ శాఖ ధ్రువపర్చిన ఆయా తహశీల్దార్ కు యమా అర్జంటుగా కీలకమైన మండలానికి పోస్టింగ్ ఇవ్వడం హనుమకొండ జిల్లా రెవెన్యూ శాఖలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వివరాల్లోకి వెడితే…
పేదింటి పిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో కొందరు రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. ఆయా పథకాల్లో ‘చిల్లర’ వసూళ్లకు పాల్పడుతున్న మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులపై, సిబ్బందిపై చర్య తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ నిరుడు జూన్ 19వ తేదీన ఉత్తర్వు కూడా జారీ చేశారు.
విజిలెన్స్ నివేదికలను, చీఫ్ సెక్రటరీ ఉత్తర్వును నెలల తరబడి తొక్కిపెట్టిన అనేక మంది రెవెన్యూ ఉన్నతాధికారులు అవినీతిపరులకు అండగా నిలిచారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ 43 మంది అవినీతి అధికారుల్లో వరంగల్ జిల్లా ధర్మసాగర్ లో పనిచేసిన ఓ తహశీల్దార్ పేరు కూడా జాబితాలో తొలిపేరుగానే నమోదు కావడం విశేషం. రాజకీయ నాయకులను బ్రోకర్లుగా నియమించుకుని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అతను అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం స్పష్టంగా వివరించింది.
విజిలెన్స్ నివేదిక జాబితాలో గల ఈ ‘చిల్లర’ కక్కుర్తి తహశీల్దార్ పై హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇటీవలే బదిలీ వేటు వేశారు. ప్రాధాన్యత లేని పోస్టింగులో అతన్ని నియమించడం ద్వారా ఓ రకంగా పనిష్మెంట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న ఈ తహశీల్దార్ ప్రాధాన్యత లేని స్థానానికి బదిలీ అయి రెండు నెలలు కూడా గడవక ముందే మళ్లీ ప్రాధాన్యత గల పోస్టింగులొ నియమితం కావడంపై హనుమకొండ జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంత స్వల్ప వ్యవధిలోనే తీవ్ర అవినీతి ఆరోపణలు గల అధికారికి మళ్లీ ప్రాధాన్యత గల పోస్టింగ్ దక్కడంపై సహజమైన ఆరోపణలు, విమర్శలే వస్తున్నాయి.