ఒకప్పుడు ఓ కవిగారు ఓ కథ చెప్పారు!
ఆ కథను ఏదో ఒక ఆఫ్రికా దేశంలో ఎవరో ఒక రచయిత రాసిన కథ అని కూడా చెప్పారు!
ఆ కథ ఇలా ఉంది…
ఆఫ్రికా దేశంలో ఒక గ్రామంలో ఒక ఉదయమే ఒక మనిషి మరణించాడు. అయ్యో అంటూ తెలిసిన వారు గబగబా అటు వైపు వెళుతున్నారు!
ఓ పెద్దాయన మటుకు – స్నానం చేసి కొత్తబట్టలు ధరించి
సంతోషంతో ఆ చనిపోయిన మనిషిని చూడటానికి బయలుదేరాడు!
‘ఏమయ్యా ! మనిషి చనిపొయ్యాడు- ఈ స్నానం ఏమిటి ఆ కొత్తబట్టలు ధరించడం ఏమిటి? మొహంలో సంతోషం ఏమిటీ?’ అని మరెవరో అతన్ని ప్రశ్నిస్తే,
అతను చెప్పాడట ” ఓ మనిషి సహజంగా చనిపోవడాన్ని ఇన్నాళ్లకు చూస్తున్నాను- అందుకే సంతోషం కలుగుతోంది ” అని అన్నాడట!
అంటే ఆ గ్రామంలో ఆ సమాజంలో అన్నాళ్లూ మనుషులు ఎవరూ నిండా నూరేండ్లు బితికి మరణించిన వారు లేరన్నమాట!
పేదరికం హత్యలు ఆత్మహత్యలు యుద్దాలు, అంతర్యుద్ధాల మధ్య, ఎవరూ ప్రకృతి నియమం ప్రకారం నిండా నూరేండ్లు బతకడం లేదన్నమాట!
ఈ చిన్న కథ నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది!
అది వెనుకబడిన ఆఫ్రికా సమాజపు కథ అని సరిపెట్టుకుందాం- మరి మన దగ్గర ఎలా ఉంది?
మొన్న మన ఘనత వహించిన గొల్లకొండ నగరంలో ఒక లేబర్ అడ్డా మీద ఒక అమ్మాయి కూలీ పనికి నిలబడితే ఎవడో ఒకడు పని ఉంది రమ్మని బండిమీద ఎక్కించుకుని రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అత్యాచారం చెయ్యబోతే అమ్మాయి ఎదురు తిరిగితే చంపి శవాన్ని చెట్ల పొదల్లో పారేసి పొయ్యాడు!
మరో అమ్మాయి తన ప్రేమికున్ని పెళ్లి విషయం మీద నిలదీస్తే అమ్మాయి కడుపులో కత్తులు దించి చంపాడు!
మరొక ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది!
ప్రభుత్వ అధికారి అయిన తరువాత లంచాలకు ఎగబడగా ఎవరో బాధితుడి ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ పట్టుకోగా జైలులో ఉంటూ కిటికీ ఊచలకు టవల్ తో ఉరేసుకు చనిపొయ్యాడని వార్త!
‘అది ఆత్మహత్య కాదూ, ప్రభుత్వ పెద్దలే హత్య చేయించారని’ అతని భార్య మానవహక్కుల కమీషను ముందు మొరపెట్టుకుంది!
మొన్న ఆదివారం సాయంత్రం మానుకోట జిల్లాలో(మహబూబా బాద్) తొమ్మిది సంవత్సరాల బాలున్ని వాడి పాత పనివాడు ఎత్తుకుపోయి నలబై ఐదు లక్షల రూపాయలు ఇస్తే వదులుతానని బేరం పెట్టాడు. డబ్బు ఇవ్వడంలో జాప్యం జరిగిందని బాలున్ని గుట్ట మీద చంపి పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. హంతకుని సంగతి ఏమవుతుంది?
ఎక్కడో అడవుల్లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు చనిపొయ్యారని ఓ వార్త అయితే, ఇన్ఫార్మర్ నెపంతో మరో అడవిలో మరో గిరిజనున్ని నక్సలైట్లు హత్య చేశారని మరో వార్త!
దేశం సరిహద్దులలో నిత్యం చనిపోతున్న సైనికులు ఒకవైపు!
ఈ నగరంలో ఈ వారంలో కురిసిన వర్షాలకు వరదలకు దాదాపు నూరు మంది ప్రజలు మరణించారు!
మరేదైనా యూరోప్ దేశం అయితే ఈ కారణంగా ప్రభుత్వమే రాజీనామా చేసేదని మిత్రుడు ఒకాయన వాపొయ్యాడు!
మన సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు మామూలు అయ్యాయి!
ఇట్లా చెప్పుకుంటూ పోతే అంతులేని హత్యాకాండ వార్తలు ఉన్నాయి. మనం ఓసారి ఇదే నగరంలో ఉన్న అనేక చిన్నాపెద్దా హాస్పిటల్లలో జరుగుతున్న అసంఖ్యాక మరణాలను అధ్యయనం చేస్తే, సమాజపు అనారోగ్య సూచీ ఎక్కడ తచ్చాడుతోందో తెలుస్తుంది!
ఎన్ని జబ్బులో- క్యాన్సర్ లోనే వంద రకాలు ఉన్నాయట!
ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ ఒక్క రోజు ఆదాయం ఎంతుంటుందో ఎవరైనా లెక్కలు వేసారా?
కోట్లలో ఉండి ఉండవచ్చు!
నగరం నిండా ఎన్ని హాస్పిటల్లో?
ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో నిత్యం ఇన్ని అర్ధాంతరపు మరణాలు ఏల?
ప్రపంచ జనాభాలో ఓ ఇరవై శాతం ఇక్కడ ఈ దేశంలో ఉన్నారు!
వారందరికీ తిండి కావాలి. అధికోత్పత్తి రసాయన ఎరువులు పురుగుమందులు, పరిశ్రమలు ఉద్యోగాలు ఉరుకుల పరుగుల జీవితాలు అధిక సంపాదన మానసిక ఒత్తిడుల మధ్య విషాహారం తింటూ, తినేది తక్కువ పారేసేది ఎక్కువ. ఓ నూరు కోట్ల మందికి తిండి ఎక్కువై, ఓ ముప్పై కోట్ల మందికి తిండి తక్కువై, తినకూడనివి తింటూ, చెయ్యకూడనివి చేస్తూ, పాలకవర్గాలు, ప్రజలు, వారూ వీరూ రోగాల పాలై …
ప్రస్తుతం ప్రపంచ మానవుల సగటు ఆయుర్దాయం పెరిగి డెబ్బై సంవత్సరాలకు చేరిందట. అయితే అది రోగాల ఆయుర్దాయం అని అదే నివేదిక చెప్పింది!
ఔషధాల మీద చికిత్సల మీద ఆధారపడిన ఆయుర్దాయమట. సహజసిద్ధమైన ఆయుర్దాయం కాదట!
జీవితం సాంతం అసహజంగా మారినప్పుడు,
సహజ మరణాలకు చోటు ఎక్కడ ఉంటుంది?
‘జగమేలే పరమాత్మా, ఎవరితో మొరలిడుదు?’ అని త్యాగరాజు రామునికి మొరపెట్టుకున్నాడు!
మరి మనం?
విజ్ఞులు ఆలోచనలు చెయ్యాలి!
తిరిగి ప్రకృతిలోకి పయనించాలి!
మరో దారి లేదు!
✍️ తుమ్మేటి రఘోత్తమరెడ్డి