దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.
వచ్చే పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశానికి సహజంగానే ప్రాధాన్యత ఏర్పడింది.