వరంగల్ మహానగరంలో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ఈ మార్గం ద్వారా గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ ను కూడా ఇటీవల నిర్వహించారు. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అభివృద్ధి పనుల్లో ఈ సొరంగ మార్గం నిర్మాణాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు. సికింద్రాబాద్ డివిజన్ లోని కాజీపేట డిపో పరిధిలో కోమటిపల్లి వద్ద నిర్మించిన ఈ మార్గాన్ని రైల్వే శాఖ పరిభాషలో రైలు అండర్ రైలు (RUR) టన్నెల్ గా పిలుస్తున్నారు. అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ గానూ వ్యవహరిస్తున్నారు.
ఈ సొరంగ మార్గంలో ప్రత్యేకత ఏమిటంటే రెండు రైళ్లను ఏకకాలంలో వెళ్లేలా చేస్తుంది. అంటే ఓ రైలు ఉపరితలంపై నడుస్తుండగా, మరో రైలు సొరంగ మార్గంలో భూగర్భం నుంచి వెడుతుంది. హసన్ పర్తి – కాజీపేట మార్గంలో దాదాపు 340 మీటర్ల పొడవునా రూ. 32 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. భూసేకరణలో ఎదురైన కొన్ని సమస్యల నేపథ్యంలో అక్కడ గల భవనాలకు ఎటువంటి నష్టం జరగకుండా రైల్వే శాఖ ఇక్కడ సొరంగ మార్గాన్ని ఎంచుకుని నిర్మించడం విశేషం.
ఉత్తర, దక్షిణ భారత రైల్వే మార్గాలకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కాజీపేట కూడా ఒకటి. ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే ‘Y’ ఆకారంలో రెండుగా చీలుతుంది. ఇందులో ఓ రూటు ద్వారా సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా, విజయవాడ మార్గంలో వెళ్లే రైళ్లు వరంగల్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్ రద్దీగా మారుతుంది. వరంగల్ వైపు గూడ్స్ రైళ్లు వెళ్లేంత వరకు ఢిల్లీ, బల్లార్షా వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల రైళ్లను కాజీపేట ఔటర్ లోని వడ్డేపల్లి చెరువు ప్రాంతం వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణం తీవ్ర ఆలస్యమవుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో రైల్వే అధికారులు వినూత్న ఆలోచన చేశారు. వీలైనంతవరకు ఎటువంటి వెయిటింగ్ లేకుండా ఢిల్లీ వైపు నుంచి కాజీపేట, వరంగల్ మార్గాల్లో మెయిన్ లైన్ లోకి రైళ్లు వెళ్లే విధంగా ప్రణాళికను రచించారు. ఇందులో భాగంగానే కాజీపేట, వరంగల్ వైపు రైళ్లు వెళ్లేందుకు ‘వై’ ఆకారంలో ట్రాక్ నిర్మాణం చేపట్టారు. హసన్పర్తి రోడ్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే రైళ్లు భూమి ఉపరితలం నుంచి, కాజీపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు కోమటిపల్లి వద్ద నిర్మించిన RUR సొరంగంలోకి ప్రవేశిస్తాయి. కోమటిపల్లి వద్ద రైళ్లు మెల్లమెల్లగా కిందికి దిగుతూ 350 మీటర్ల మేర భూగర్భ మార్గంలో ప్రయాణించి ఆ తర్వాత పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితల స్థితికి చేరుకుంటాయి. దీంతో రైళ్ల క్రాసింగ్ సమస్య తీరనుంది. బైపాస్ పనులు పూర్తయితే హసన్పర్తి రోడ్ నుంచి అటు వరంగల్ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే RUR సొరంగ మార్గం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇటీవలే ఓ గూడ్స్ రైలును ఈ మార్గం ద్వారా ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మరో వారం, పది రోజుల్లోనే ఈ సొరంగ మార్గం ద్వారా రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో మూడో రైల్వే లైన్ ఉన్నప్పటికీ, RUR సొరంగ మార్గాన్ని అదనంగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రూట్ లో ప్రధానంగా గూడ్స్ రైళ్లను మాత్రమే నడిపే అవకాశమున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా కాజీపేట మీదుగా మెయిన్ లైన్ లోకి ప్రవేశించి సికింద్రాబాద్ వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన RUR సొరంగ మార్గం ప్రత్యేకతగా చెబుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే చరిత్రలోనే RUR సొరంగ మార్గం చరిత్రాత్మకంగా పేర్కొంటున్నారు. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించిన RUR సొరంగ మార్గాన్ని దిగువన గల వీడియోలో వీక్షించవచ్చు..