ఇద్దరు పోలీసులు దారుణ హత్యకు గురయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపునకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాకు పనిమీద వెళ్లిన ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుళ్లు హత్యకు గురైనట్లు ఎస్పీ కెఎల్ ధ్రువ్ కూడా ధృవీకరించారు.
ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం… దంతెవాడ జిల్లా నేతల్ నార్ నివాసి పునేం హరమ, జేగురుగొండకు చెందిన ధనిరామ్ కశ్యప్ ఓ పనిమీద బెజ్జి సమీపంలోని గ్రామంలో గల అసుపత్రికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైకుపై వస్తున్న ఈ ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. ఆ తర్వాత ఇద్దరి డెడ్ బాడీలను రోడ్డుపై పడేశారు. ఘటనానంతరం పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాగా ఈ హత్యలపై సుక్మా ఎస్పీ ధ్రువ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత కక్షలు ఇందుకు దారి తీసి ఉండవచ్చని, పూర్తి వివరాలను కనుక్కునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.