దివాళ దిశలో పయనిస్తున్న అనేక మంది ఖమ్మం జిల్లా వ్యాపారుల జాబితాలో మరో ఇద్దరు చేరారు. హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్న దంపతులు ఖమ్మం కోర్టులో ఐపీ దాఖలు చేశారు. దీంతో వాళ్లను నమ్మి అప్పులిచ్చిన వారు లబోదిబోమంటున్నారు. అప్పులు తీసుకుని అకస్మాత్తుగా అదృశ్యమై, పలువురు వ్యాపారులు ఐపీ దాఖలు చేస్తున్న తీరు భిన్న చర్చకు దారి తీస్తోంది.
తాజాగా బోనకల్ లో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్న రామన నరసింహారావు, అతని భార్య సుధారాణిలు రూ. 2.75 కోట్ల మొత్తానికి దివాళా పిటిషన్ దాఖలు చేశారు. హోటల్ స్థాపన తర్వాత అప్పులు చేసిన దంపతులు ఐపీ దాఖలు చేశారు. వ్యాపారం సరిగ్గా నడవక, అప్పులకు వడ్డీలు పెరిగాయని, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని పేర్కొంటూ ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వీళ్లిద్దరూ ఐపీ పిటిషన్ దాఖలు చేశారు.
రామన నరసింహారావు రూ. 1.95 కోట్ల మొత్తానికి, అతని భార్య సుధారాణి రూ. 80.59 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. ఈమేరకు నోటీసులు అందడంతో రుణదాతలు లబోదిబోమంటున్నారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే ఇద్దరు ప్రముఖ వ్యాపారులు పత్తా లేకుండాపోయిన ఘటనలను మరువక ముందే వరుసగా మరికొందరు వ్యాపారులు దివాళా దిశగా పయనిస్తుండడం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.