ఖమ్మం నగరంలో మరో ఇద్దరు వ్యాపారులు ‘దివాళా’ దిశగా పయనించారు. తమను దివాళా దారులుగా ప్రకటించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు ఇప్పటికే తమ ‘దుకాణాల’కు షట్టర్లు దించగా, తాజాగా మరో ఇద్దరు వ్యాపారులు కూడా తాము వ్యాపారాల్లో నష్టపోయినట్లు ఐపీ దాఖలు చేయడం గమనార్హం.
ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి దాదాపు రూ. 200 కోట్ల వరకు అప్పులు చేసి ఉడాయించగా, ఇంకో పత్తి కొనుగోలుదారుడు రూ. 30 కోట్ల వరకు అప్పులతో రుణదాతలకు కనిపించకుండాపోయాడు.ఈ రెండు ఉదంతాల్లో ఆ ఇద్దరు ప్రముఖ వ్యాపారులు అధికారికంగా దివాళా పిటిషన్ దాఖలు చేయలేదు. కానీ 20, 30 శాతం చొప్పున ‘సెటిల్మెంట్ల’తో రుణదాతల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ ఇద్దరు ప్రముఖ వ్యాపారుల అప్పులు, అదృశ్యం ఘటనలతో ఖమ్మం బిజినెస్ మార్కెట్ ఇప్పటికే అతలాకుతలమవుతున్న పరిణామాల్లో తాజాగా మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ దాఖలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన మిర్చి వ్యాపారి పొన్నెబోయిన శ్రావణ్ కుమార్ రూ. 1.42 కోట్లకు ఐపీ దాఖలు చేశారు. కార్తికేయ ఎంటర్ ప్రైజెస్ పేరుతో 2018 నుంచి మిర్చి వ్యాపారం చేస్తున్న తాను వ్యాపార అవసరాల కోసం పలువురి వద్ద అప్పులు చేసినట్లు కోర్టుకు నివేదించారు. కోవిడ్, ఇతర కారణాల వల్ల తనకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. ఏడుగురు రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ తనను దివాళాదారునిగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ అడ్వకేట్ జె. పాపారావు ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అదేవిధంగా గాంధీ చౌక్ ప్రాంతానికే చెందిన మరో మిర్చి వ్యాపారి పిల్లిగుండ్ల సురేష్ కూడా రూ. 29.64 లక్షల మొత్తానికి ఐపీ దాఖలు చేశారు. ఖమ్మంలో తాను 2018 నుంచి మిర్చి వ్యాపారం చేస్తున్నానని, వ్యాపార అవసరాల కోసం అప్పులు చేశానని, కోవిడ్, ఇతర కారణాల వల్ల నష్టాలు సంభవించాయని పేర్కొన్నారు. మొత్తం ముగ్గురు రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ, తనను దివాళాదారునిగా ప్రకటించాలని అడ్వకేట్ జె. పాపారావు ద్వారా సురేష్ ఐపీ దాఖలు చేశారు.