రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. బిల్డింగ్ పైన గల వాటర్ ట్యాంక్ లో రెండు నెలల బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలానికి దారి తీసింది. గ్రామానికి చెందిన మంచాల రంగయ్య కూతురి కుమారుడు రెండు నెలల ఉమా మహేష్ అనే బాలుడు కనిపించకుండాపోయాడు.
అతని ఆచూకీ కోసం ఉదయం నాలుగు గంటల నుంచి గ్రామంలో బాలుని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో పొలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు గ్రామంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. బాలుని ఆచూకీపై ఎటువంటి ఆధారాలు లభించకలేదు. అనుమానంతో ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో పోలీసులు చూడగా బాబు మృతదేహం కనిపించింది. అయితే రెండు నెలల వయస్సు మాత్రమే గల బాబు ఇంటిపైన ఉన్న ట్యాంక్ లో ఎలా పడతాడు? ఎవరో వేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.