మావోయిస్టు నక్సలైట్లు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కడిమెట, కాడెనార్ క్యాంప్ మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు నక్సలైట్లు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన పరస్పర కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ తోపాటు, ఐటీబీపీ విభాగానికి చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు.
ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో పోలీసుల ప్రతీకార కాల్పుల తర్వాత నక్సలైట్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న నక్సలైట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు నిర్వహిస్తున్నాయని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ చెప్పారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి ఘటనను ఆయన ధృవీకరించారు.