ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమాంతరంగా మరో మంత్రి ఉన్నారా? ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సమాంతరంగా తుమ్మల రాజకీయ నెరపుతున్నారా?  అదేమిటి..? ఇదేం ప్రశ్న..? అనుకుంటున్నారా? సెలవు రోజున… ముఖ్యంగా ఆదివారం పూట చోటు చేసుకున్న ఓ సమీక్ష ఘటన రాజకీయంగా అధికార పార్టీలో తీవ్ర కలకలానికి దారి తీసింది.  ఇంతకీ విషయం ఏమిటంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.  ప్రాజెక్టు పనులు పెండింగ్ లో ఉన్న విషయాలను ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ కు ఫోన్ ద్వారా  తెలిపారు. ఇందుకు స్పందించిన రజత్ కుమార్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వర్ రావుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అటు భద్రాద్రి, ఇటు ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి పెండింగ్ పనులు జూన్ జూలై నెల వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను తుమ్మల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.. ఇదీ విషయానికి సంబంధించిన సారాంశం.

ఈ అంశంలో ట్విస్ట్ ఏమిటంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఏ హోదాలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రజాప్రతినిధి హోదాలేని తుమ్మల సమీక్షకు ఇరిగేషన్ అధికారులు ఏ ప్రాతిపదికన హాజరై నిలబడి మరీ సమాధానం ఇచ్చారు? మాజీ మంత్రి కూర్చోగా, అధికారులు నిలబడిన సీన్లు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తుమ్మల పిలిస్తేనే వెళ్లారా? లేక రాజధాని నుంచి ఏవేని ఆదేశాలు అందాయా? ఇవీ అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉదంతం అధికార పార్టీలో సరికొత్త రచ్చకు కారణమైందనే వాదనలు వినిపిస్తుండడం విశేషం.

Comments are closed.

Exit mobile version