ఇక్కడ గల, ఫొటోను, వీడియోను జాగ్రత్తగా గమనించండి. సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో ఆదివారం నిర్వహించిన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ వేదిక ఇది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
అయితే గ్రామ సభ నిర్వహణలో భాగంగా నిర్మించిన వేదికకు బ్యాక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఓసారి నిశితంగా పరిశీలించండి. ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఫొటో పక్కనే గల మరో ఫొటోకు ‘మాస్క్’ వేసి మూసేసిన సీన్ అధికార పార్టీ వర్గ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఫ్లెక్సీలో తమ నాయకుడి ఫొటోను ఎందుకు ముద్రించారు? మరెందుకు మూసేశారు? అనే ప్రశ్నలతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ వర్గీయులు కుతకుత ఉడికిపోతున్నారు.
వాస్తవానికి ‘ప్రొటోకాల్’ ప్రకారం ఏ హోదాలోనూ లేని తుమ్మల ఫొటోను ఫ్లెక్సీలో ముద్రించడమే వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది. తీరా వేదికపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాక, తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రాన్ని మూసివేయక తప్పని స్థితి ఏర్పడింది. అసలు తమ నేత ఫొటోను ఎవరు ముద్రించమన్నారు? అనే ప్రశ్నను తుమ్మల అనుయాయులు లేవనెత్తుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తుమ్మల వైపు కన్నెత్తి చూడకుండా రాజకీయ చక్రం తిరిగిందనే ఆక్రోశాన్ని కూడా ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీలోనే తుమ్మల, ఎర్రబెల్లిల మధ్య పాత స్నేహం ఉంది. రెండు రోజుల ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా తుమ్మలకు చెందిన పాకాలగూడెంలోని గెస్ట్ హౌజ్ లో నిన్న రాత్రి ఎర్రబెల్లి బస చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించి సమాచారం ఉండడంతో గెస్ట్ హౌజ్ లో బసకు, డిన్నర్ కు సకల ఏర్పాట్లు కూడా జరిగాయనే కథనం ప్రచారంలో ఉంది. అయితే ఎర్రబెల్లి తుమ్మలను కలవకుండా, ఆయన గెస్ట్ హౌజ్ కు వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. ఆదివారంనాటి మంత్రి దయాకర్ రావు సత్తుపల్లి నియోజకవర్గ పర్యటన అక్కడి నుంచే ప్రారంభం కావలసి ఉందని కూడా అంటున్నారు.
అయితే గెస్ట్ హౌజ్ కు రాకుండానే ఎర్రబెల్లి పర్యటన ముగియడంతో తుమ్మల నాగేశ్వర్ రావు వర్గీయులు తెగ ఆవేదన చెందుతున్నారట. మొత్తంగా ఆయా అంశాలపై తుమ్మల వర్గీయులు లోలోనే మథనపడుతున్న పరిణామాల్లో ఆయన ఫొటోకు మాస్క్ వేసి మూసేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.