మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణను రాజ్ భవన్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణకు తుమ్మల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల కొద్దిసేపు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కోకా సుబ్బారావు 1966-67లో పనిచేశారని, ఆయన తర్వాత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్.వి. రమణను తుమ్మల నాగేశ్వర్ రావు కొనియాడారు. ఓ న్యాయవాదిగా, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, సుప్రీకోర్టు న్యాయమూర్తిగా ఎన్.వి. రమణ చేసిన సేవలు శ్లాఘనీయమని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరెన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి తెలుగువాడి కీర్తిని ఇనుమడింపజేయాలని తుమ్మల అభిలషించారు. జస్టిస్ ఎన్.వి. రమణను కలిసిన తుమ్మల నాగేశ్వర్ రావు వెంట ఆయన తనయుడు తుమ్మల యుగంధర్ కూడా ఉన్నారు.