రాజకీయ నేపథ్యపు పరిచయం అక్కరలేని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అడ్వాన్స్ బలప్రదర్శన చేస్తున్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో తుమ్మల పాలేరు నియోజకవర్గం కేంద్రంగా చేస్తున్న కేడర్ బలప్రదర్శన రాజకీయ చర్చకు తావు కల్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిని చవి చూసిన తుమ్మల పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనే సామెతకు అనుగుణంగా నియోజకవర్గాన్ని తన పర్యటనల ద్వారా చుట్టేస్తుండడం విశేషం.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సంయమనంతో వ్యవహరిస్తున్న తుమ్మల గడచిన కొంత కాలంగా పాలేరు నియోజకవర్గంలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఈమేరకు నియోజకవర్గంలోని మండలాల్లో నిత్య పర్యటనలను కొనసాగిస్తున్నారు. తాను మళ్లీ ప్రజల ముందుకు వస్తానని, ప్రజాసేవలో నిమగ్నమవుతానని, అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
నియోజకవర్గంలో పార్టీ నాయకుల, కార్యకర్తల ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వారి ఆహ్వానం మేరకు వెడుతున్న తుమ్మల నాగేశ్వర్ రావు వెంట భారీగా పార్టీ కేడర్ కదులుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. నేలకొండపల్లి మండలం చెర్వు మాదారంలో నిన్న జరిగిన ఓ చిన్న ఫంక్షన్ కు హాజరైన తుమ్మలకు అక్కడి పార్టీ శ్రేణులు స్వాగతం పలికిన తీరు ఇంటలిజెన్స్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకకు హాజరైన తుమ్మలకు వందలాది కార్లు, బైక్ లతో నేలకొండపల్లి నుంచి చెర్వు మాదారం వరకు భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులు స్వాగతించడం విశేషం.
అయితే గత ఎన్నికల్లో సొంత పార్టీ నాయకుల విద్రోహం వల్లే తుమ్మల ఓటమి పాలైనట్లు వార్తలున్నాయి. అందువల్లే కాబోలు నిన్నటి పర్యటనలో తుమ్మల మాట్లాడుతూ, రాజకీయ శత్రువులను నమ్మవచ్చుగాని, రాజకీయ ద్రోహులను నమ్మొద్దని వ్యాఖ్యానించారు. రాజకీయ శత్రువులు ఇతర పార్టీలకు ఓట్లు వేస్తారని, కానీ రాజకీయ ద్రోహులు మాత్రం సొంత పార్టీ వారినే మోసం చేస్తారని తుమ్మల నిర్వచించారు. ఇటువంటి వారిని నమ్మొద్దని పార్టీ కేడర్ కు నిర్దేశిస్తూనే, రాజకీయ ద్రోహులు త్వరలోనే ఇతర పార్టీలోకి వెడతారని కూడా తుమ్మల వ్యాఖ్యానించడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచి బరిలో నిలుస్తానని, ఖచ్చితంగా పోటీ చేస్తానని తుమ్మల పార్టీ కేడర్ కు భరోసా ఇస్తున్నారు. అయితే తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేస్తారా? ఇదే జరిగితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితి ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తున్నాయి. మొత్తంగా తుమ్మల నాగేశ్వర్ రావు అడ్వాన్స్ బల ప్రదర్శన ఆయన అనుచరుల్లో, అనుయాయుల్లో, టీఆర్ఎస్ కేడర్ లో మాంచి జోష్ నింపుతోందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.