పాలకులు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు అమ్మడాన్ని సమర్ధించలేం.
సహకార రంగంలోని చక్కర కర్మాగారాలు అమ్మేశారు. ఆల్విన్ లాంటి సంస్థలు కూడా ప్రవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా దేశంలో పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవేటు భాగస్వామ్యం మొదలు పెట్టేస్తున్నారు. అమ్మకానికి ఇది తొలి అడుగు.
రాష్ట్రంలో ప్రభుత్వ నిరర్ధక స్థలాలు అమ్మకానికి పెట్టేశారు. ఇంతకు ముందు బ్యాంకుల్లో తనఖా పెట్టి ఋణాలు తీసుకునేవారు లేదా యేళ్ళ తరబడి లీజుకిచ్చి ఎంతోకొంత సొమ్ము చేసుకునేవారు పాలకులు. ఇప్పుడు ఏకంగా అమ్మేస్తున్నారు.
అందునా భక్తి విశ్వాసాలతో కూడుకున్న దేవస్థానం ఆస్తులు అమ్మకానికి పెట్టడం సమర్ధనీయం కాదు. పైగా గత పాలకులు 2015లోనే ఈ ప్రతిపాదన తెచ్చారు అని సమర్ధించుకోజూడడం గడుసుతనం అవుతుంది.
గత పాలకుల నిర్ణయాలను ప్రజలు ఆమోదించని కారణంగానే ఈ పాలకులకు అధికారం వచ్చింది. ప్రజలు తిరస్కరించిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం సరికాదు. గత పాలకుల నిర్ణయాలు అమలు చేయదలిస్తే ఆ సీట్లో వారినే కూర్చోబెట్టి ఉండేవారు ప్రజలు.
గత పాలకులను తిరస్కరించారు అంటే వారి నిర్ణయాలను కూడా ప్రజలు తిరస్కరించినట్టే అని అర్ధం చేసుకోలేకపోవడం, అంగీకరించకపోవడం పెంకితనమా లేక గడుసుతనమా?
కరోనా దెబ్బ గట్టిగా తగిలినమాట వాస్తవమే. ఆ దెబ్బ ప్రభుత్వంపైనా, ప్రవేటుపైన, దేవస్థానాలపైనా మాత్రమే కాదు కుటుంబాలపైనా ఉంది.
ఆదాయం తగ్గినప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే బయటపడతాం కానీ ఆస్తులు అమ్ముకుంటే కాదు. ఈ లాజిక్ మిస్సయితే అధికారం కూడా మిస్సవుతుంది. ఈ లాజిక్ పనిచేసిన తీరు సరిగ్గా యేడాది క్రితమే చూశాం.
✍️ గోపి దారా