సామెత తప్పు అనుకుంటున్నారు కదూ…ఔను సామెతను తిరగేసి అన్వయించాల్సి వచ్చింది మరి. అనాదిగా వాడుకలో గల ‘రాజుకన్నా మొండివాడు బలవంతుడు’ అనే నానుడిని అనేక సందర్భాల్లో మనం ఉదహరిస్తున్నాం. ఇప్పడు అభిప్రాయం మార్చుకుని ఆ సామెతను తిప్పి ఉటంకించాల్సిందే. ఆర్టీసీ సమ్మె అంశంలో చోటు చేసుకున్నఅనేక పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కూడా. ఎలాగంటే…
‘ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. వారి పొట్ట కొట్టే ఉద్దేశం మాకు లేదు. మరో అవకాశం ఇస్తున్నా. బేషరతుగా డ్యూటీలో చేరండి. ఇందుకు మూడు రోజుల గడువు విధిస్తున్నా. ఈనెల 5వ తేదీ అర్థరాత్రిలోగా డ్యూటీలో చేరిన వారికి ఏ ఇబ్బందీ ఉండదు. గడువు ముగిశాక మాకు ఇక ఉద్యోగితో సంబంధమే ఉండదు…’ ఆర్టీసీ సమ్మెపై తెలంగాణా సీఎం కేసీఆర్ ఈనెల 2వ తేదీన ఇచ్చిన పిలుపు ఇది. కేసీఆర్ డెడ్ లైన్ కు ఆర్టీసీ కార్మికుల నుంచి పెద్దగా స్పందన లభించిన దాఖలాలు లేవు. దాదాపు 48 వేల మంది కార్మికుల్లో సుమారు 400 పైచిలుకు సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. ఇప్పడు సీన్ మారింది.
‘సమ్మె విరమిస్తున్నాం. బేషరతుగా విధుల్లోకి తీసుకోండి. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వారి ఆత్మగౌరవం నిలిచేలా ఆహ్వానించాలి. హాజరు పట్టిక, డ్యూటీ చార్టుల్లో తప్ప మరెక్కడా సంతకం పెట్టం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె ఆపేస్తాం…’ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వథ్థామరెడ్డి తాజాగా బుధవారం చేసిన ప్రకటన ఇది.
దాదాపు వారం క్రితమే ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’ డిమాండ్ ను కార్మికులు వదిలేశారు. అయినప్పటికీ చర్చలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనేది రాలేదు. హైకోర్టులో వాద, ప్రతివాదనల అనంతరం బంతి లేబర్ కోర్టులోకి వెళ్లింది. ఈ పరిణామాల మధ్యలో దాదాపు 29 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానం చేయాల్సి వచ్చింది. ఉద్యోగం ఉంటుందో…ఊడుతుందో తెలియక కొందరి గుండెలు ఆగిపోయాయి. మరికొందరు ఆత్మార్పణ చేసుకున్నారు. రెండు నెలలుగా వేతనాలు లేక కొందరు కార్మికులు కుల వృత్తులను ఆశ్రయించిన ఉదంతాలనూ చూశాం. ఇప్పుడేమైంది…? సామెత తిరగబడిన చందంగా మొత్తం పరిస్థితి సీఎం కేసీఆర్ చేతుల్లోకే వెళ్లిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజుకన్నా మొండివాడు బలవంతుడనే సామెత తిరగబడిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. నలభై తొమ్మిదో రోజుకు చేరిన అర్టీసీ సమ్మె అంశంలో వేలాది మంది కార్మికుల కుటుంబాల భవిత చివరికి కేసీఆర్ థక్పథం మీదే ఆధారపడినట్లయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీకి సంబంధించి 2014 ఏప్రిల్ 29వ తేదీన తెలంగాణా సీఎం హోదాలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్ నగరంలో 80 మెట్రో లగ్జరీ ఏసీ వోల్వో బస్సులను పీపుల్స్ ప్లాజా దగ్గర ప్రారంభించిన సందర్భంగా ఆర్టీసీ గురించి కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ కార్మికుల చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే…
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది. సకల జనుల సమ్మె సమయంలో ఎవరు ఎన్ని రకాలుగా భయపెట్టినా వెనకడుగు వేయకుండా విజయవంతం చేసిన ఘనత కార్మికులది. తెలంగాణా ఉద్యోగుల మాదిరే…ఆర్టీసీ కార్మికులకూ ప్రత్యేక తెలంగాణా ఇంక్రిమెంట్ అందజేస్తాం. ఇందుకయ్యే రూ. 18.20 కోట్ల మొత్తపు భారం ఆర్టీసీ మీద పడకుండా ప్రభుత్వమే సమకూరుస్తుంది. సకల జనుల సర్వే రోజు అన్ని వర్గాలూ సెలవు తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు పనిచేశారు. టీఎస్ఆర్టీసీని నడపడం సామాజిక బాధ్యత. మొత్తం 10,300 బస్సులు, 57,200 మంది కార్మికులు, 90 లక్షల మందిప్రయాణీకులతో టీఎస్ఆర్టీసీ దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ. నష్టాలువస్తున్నా ఆర్టీసీని నడపడం సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం పరిగణిస్తోంది.‘ ఇలా సాగింది అప్పటి కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం.
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన రోజునుంచి ఇప్పటివరకుజరిగిన పరిణామాల్లో కార్మికులు గట్టి పట్టుదలతో సమ్మెను కొనసాగించినా ప్రయోజనం లేకపోయిందని, చివరికి ‘బేషరతుగా విధుల్లోకి తీసుకోండి’ అనే స్థితికి చేరిన పరిణామాలు ఓ విషాదకరంగా కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాజు అవసరాన్నిబట్టి కొన్నిసార్లు తనకుతాను తగ్గిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజుకన్నా మొండివాడు బలవంతుడనే సామెత పుట్టిందనేది నిర్వచనం. అయితే ఆర్టీసీ సమ్మె విషయంలో తాను ఎంచుకున్న వైఖరి నుంచి కేసీఆర్ ఇప్పటి వరకు అంగుళం కూడా తగ్గినట్లు కనిపించలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మొండివాడికన్నా రాజే బలవంతుడు’ అని సామెతను తిరగేసి అభివర్ణించక తప్పని స్థితి… అని అంటున్నారు పరిశీలకులు.