అనుకున్నట్లే జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగిస్తోంది. యాభై రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నామని, మంగళవారం నుంచి డ్యూటీల్లో చేరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేసిన ప్రకటనను ఆ సంస్థ ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ హాస్యాస్పదంగా నిన్ననే అభివర్ణించారు. అంతా మీ ఇష్టమేనా? అలా కుదరదని స్పష్టం చేశారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారమే జరుగుతుందని ఓ ప్రకటన జారీ చేశారు. అయినప్పటికీ మంగళవారం ఉదయమే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ తమ డిపోలకు చేరుకున్నారు. విధుల్లో చేరేందుకు వారు చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం తరపున పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనలు, అరెస్టులు షరా మామూలే. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కూడా. ‘మేం ఏం తప్పు చేశాం? మాకెందుకీ శిక్ష?’ అంటూ మహిళా కార్మికులు రోదించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, మహబూబ్ నగర్ నుంచి మెదక్ వరకు, రాజధాని నుంచి నిజామాబాద్ వరకు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. కొన్ని చోట్ల కార్మికులకు గుండెపోటు వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల రోదనలతో తెలంగాణా అట్టుడుకుతోంది. ఆందోళనలో పాల్గొన్నవారి పట్ల సర్కారు ఆదేశం మేరకు పోలీసుల వైఖరికి నిదర్శనం మీరు చూస్తున్న దృశ్యం.