అధికార పార్టీ నేతలకు చెందిన మీడియా సంస్థ పేరు చెప్పుకుంటూ అనేక దురాగతాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న ఓ జర్నలిస్టు వ్యవహారంపై ఎంపీ జోగినపల్లి సంతోష్ తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసింది. సదరు జర్నలిస్టును పూర్తి స్థాయిలో తొలగించామని, సంస్థ పేరు చెప్పుకోవద్దని కూడా సంబంధిత మీడియా సంస్థ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ‘ఎంపీ జోగినపల్లి గారికి.., ‘ఆరణ్య’ వేదన ఏమనగా! శీర్షికన ts29.in వెబ్ సైట్ ఈరోజు వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కథనం టీఆర్ఎస్ వర్గాల ద్వారా ఎంపీ సంతోష్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు జర్నలిస్టు వ్యవహారంపై ఎంపీ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం.
ఇల్లెందు నియోజకవర్గంలోని లచ్చగూడెంలో పోడు భూముల వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు చెందిన ఓ మీడియా సంస్థలో ఐడీ కార్డు మాత్రమే గల జర్నలిస్టు ఒకరు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సదరు జర్నలిస్టు ఆగడాలను నిలువరించడమే లక్ష్యంగా ఆదివాసీలు, తుడుందెబ్బ నాయకులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఈమేరకు నిన్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా లచ్చగూడెం పోడుభూములను పరిశీలించి, ఆదివాసీల ఆందోళనకు మద్ధతు తెలిపారు. ఈ పరిణామాల్లోనే ts29.in వార్తా కథనాలను ప్రచురించింది. తాజాగా ఆదివారం కూడా మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో తీవ్ర వివాదాస్పదమైన ఆయా జర్నలిస్టు విషయంలో సంబంధిత మీడియా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… సదరు జర్నలిస్టుకు ఇక నుంచి అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థతో ఎటువంటి సంబంధాలు ఉండవు. సంస్థ పేరు చెప్పుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా మీడియా సంస్థ నిర్వాహకులు హెచ్చరించినట్లు తెలిసింది. అతన్ని సీఎంవో అధికారిక వాట్సప్ గ్రూపు నుంచి కూడా తొలగించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. అంతేగాక అతను ఎక్కడైనా తమ మీడియా సంస్థ పేరుతో చెలామణిలో ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆ సంస్థ జిల్లా ఉద్యోగులకు కూడా మౌఖిక ఆదేశాలు జారీ చేశారంటున్నారు. అంతేకాదు అతని చర్యలవల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా అతని కార్యకలాపాలకు సహకరించరాదని, అతనికి పూర్తిగా దూరంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా లచ్చగూడెం పోడుభూముల వివాదంలో సదరు జర్నలిస్టు వ్యవహారాలపై ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆగ్రహించారనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది.