కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అదనపు బస్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జన్నార్ ప్రకటించారు. హైదరాబాద్ నగర శివార్లలో న్యూ ఇయర్ వేడుకలు జరిగే ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నట్లు చెప్పారు.
ఈ బస్సుల్లో ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున ఛార్జి వసూలు చేస్తారని, ఆర్టీసీ నిర్దేశించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కు వెళ్లే వారి కోసం 31వ తేదీ రాత్రి 7.30, 9.30 గంటలకు, తిరుగు ప్రయాణం కోసం అర్థరాత్రి 12.30 గంటలకు, తెల్లవారు జామున 3.00 గంటల వరకు బస్సు సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు. అంతేగాక 18 సీట్ల ఏసీ బస్సులను ఈవెంట్స్ కు వెళ్లి రావడానికి రూ. 4,000 మొత్తానికి ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు.
కాగా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పన్నెండేళ్ల లోపు చిన్నారుల కోసం కూడా ఆర్టీసీ మరో ఆఫర్ ను ప్రకటించింది. ఆయా వయస్సులోపు గల పిల్లలు జనవరి 1వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ సజ్జన్నార్ చెప్పారు.