జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ విసిరారు. ‘వరదలాగా ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాదుకు స్వాగతం. ఈ రాక ఏదో, నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేది. ఉత్త చేతులతో రాకుండా, వస్తూ సీఎం కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా రు. 1,350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
కాగా దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లను ఉద్దేశించి ఈ రోజు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.