రేపు తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ పుట్టిన రోజు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈరోజు నమస్తే తెలంగాణా పత్రికలో రాసిన వ్యాసంలోని వాక్యాల ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఓ బక్క పల్చటి మనిషి పిడికెడు మందితో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు. అంటే 2001 సంవత్సరం… ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ అనే ఉద్యమ సంస్థ తన ప్రస్థానానికి బీజం వేసిన శుభదినం. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ పోరాటంలో అనేక మంది బలిదానం, త్యాగాలు వంటి అంశాలు అనేకం. మొత్తంగా ప్రత్యేక రాష్ట్ర సాధన సాకరమైంది. ఆ ఉద్యమం, పోరాటపు సన్నివేశాల ఘట్టం చరిత్రాత్మకం.
కానీ ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పుట్టిన రోజును పార్టీ శ్రేణులు, అభిమానులు, తెలంగాణా ప్రజలు ఏ ప్రాతిపదికన జరుపుకోవాలి? ఇదీ ప్రశ్న. అదేం ప్రశ్న అంటే… ఓ సందేహం. తెలంగాణా మాండలికంలో చెప్పాలంటే ఒకానొక తికమక. ఎందుకంటే కొందరు నేతలు పార్టీ ద్విదశాబ్ధి వేడుకలు అంటున్నారు. మరికొందరు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ పుట్టిందంటున్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాసిన ప్రత్యేక వ్యాసాన్ని నమస్తే తెలంగాణా పత్రిక ప్రచురించింది. వేదిక కాలమ్ కింద పబ్లిష్ అయిన ఈ వ్యాసంలో ‘రేపు టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవం’ అంటూ పత్రిక ఉటంకించడం గమనార్హం. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్బవించి రెండు దశాబ్ధాలు పూర్తయిందని పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవలసిన వేడుకలను కరోనా వ్యాప్తి వల్ల నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన వెలువడడం గమనార్హం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఆడంబరాలు, హంగామా లేకుండా, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పార్టీ పుట్టిన రోజును జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తమ తమ ఇండ్లపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో రేపు జరిగేది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలా? ఇరవై ఏళ్లు పూర్తయిన సంబరాలా? అంటే.. ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావ వేడుకలనే చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రారంభించారు. అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించి రేపటికి 19 ఏళ్లు పూర్తయి… 20వ వసంతంలోకి అడుగిడుతోంది. కాబట్టి టీఆర్ఎస్ ద్విదశాబ్ధి వేడుకలు 2021 ఏప్రిల్ 27న జరుపుకుంటారనేది సుస్ఫష్టం. పూర్తయిన సంవత్సరాలను మాత్రమే వార్షికోత్సవ గణాంకాలుగా పరిగణిస్తారన్నది విస్పష్టం.