తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు.
ఉదయం, వార్త తదితర పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి తీవ్రవాద ఉద్యమంలోనూ పనిచేసి నిర్బంధాన్ని ఎదుర్కున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానంతరం ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో రామలింగారెడ్డి పోరాటాన్ని గుర్తించిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆయనకు దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.
తొలిసారి 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామలింగారెడ్డి ఆ తర్వాత 2008, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా వరుస విజయం సాధించారు. సీఎం కేసీఆర్ కు సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన రామలింగారెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగారెడ్డి మరణవార్త అధికార పార్టీ నేతల్లో, శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.