ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలకు ఆ పార్టీ నేతలే మోకాలొడ్డుతున్న ఘటనలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీకి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు తనకు తోచిన సాయం చేసేందుకు పర్యటిస్తున్న పొంగులేటి కార్యక్రమాలకు సొంత పార్టీ నాయకులే పొగ పెడుతుండడంపై ఆ పార్టీ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి.

వాస్తవానికి రాజకీయంగా పొంగులేటి అధికార పార్టీ నుంచి పెద్దగా బావుకున్నది కూడా ఏమీ లేదనే చెప్పాలి. వైఎస్ఆర్ సీపీ తరపున 2014లో ఎంపీగా గెల్చిన శ్రీనివాసరెడ్డి మారిన రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ, టికెట్ నిరాకరించిన పార్టీ అధినేత నిర్ణయాన్ని శిరోధార్యంగా పాటిస్తున్నారు. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లే తనకు గాడ్ ఫాదర్ లుగా పొంంగులేటి బాహాటంగానే వెల్లడిస్తున్నారు.

అయితే స్థానిక నాయకులు కొందరు మాత్రం ఏదేని ప్రాంతంలో పొంగుటేటి పర్యటన ఖరారైందే తడవుగా ఉలిక్కిపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకుంటే సొంత పార్టీ నాయకుడి పర్యటనకు కార్యకర్తలెవరూ హాజరు కావద్దని పిలుపునివ్వడమేంటనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. పార్టీకి చెందిన ఏ కుటుంబంలో శుభకార్యం జరిగినా ఆహ్వానం అందిందే తడువగా పొంగులేటి అక్కడ హాజరవుతుంటారు. తెలంగాణా సంప్రదాయం ప్రకారం తనకు తోచిన కట్న, కానుకలు చదివిస్తుంటారు.

అదేవిధంగా వేర్వేరు కారణాల వల్ల ఇంటి పెద్దలనో, సభ్యులనో కోల్పోయిన కుటుంబాల విషాద ఘటనల్లోనూ పాలు పంచుకుని, ఆయా కుటుంబాలను కూడా పొంగులేటి పరామర్శిస్తుంటారు. వారికి తనదైనశైలిలో ఆర్థిక సాయం చేస్తూ, అండగా నిలుస్తున్నారు. ఆప్తులకు, పార్టీ కార్యకర్తలకు ఈ తరహా సాయం చేయడం పొంగులేటి తాజాగా చేసుకున్న అలవాటేమీ కాదు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన కాలం నుంచీ చేస్తున్న సాయం తాలూకు నిరంతర ప్రక్రియ.

ఇందులో భాగంగానే శనివారం పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లో పొంగులేటి పర్యటిస్తున్నారు. ఈ రెండు మండలాల్లోని 17 గ్రామాల్లో పొంగులేటి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పొంగులేటి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విశ్రమించకుండా తన పర్యటనను ఖరారు చేసుకున్నారు.

అయితే పొంగులేటి పినపాక నియోజకవర్గ పర్యటనపై ఆ పార్టీకి చెందిన నాయకులు వ్యతిరేక పిలుపునివ్వడం గమనార్హం. పొంగులేటి పర్యటనకు హాజరు కావద్దని టీఆర్ఎస్ కరకగూడెం, పినపాక మండలాల అధ్యక్షులు రావుల సోమయ్య, పగడాల సతీష్ రెడ్డిలు పిలుపునిచ్చారు. పరామర్శల పేరుతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సమాచారం లేకుండా పర్యటిస్తున్నారని వారు అంటున్నారు. అందువల్ల పొంగులేటి పర్యటన కార్యక్రమాల్లో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలెవరూ పాల్గొనవద్దని, హాజరు కావద్దని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించడంపై పార్టీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రయివేట్ కార్యక్రమాలకు కూడా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా? అని పొంగులేటి అనుయాయులు, అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పొంగులేటి పర్యటన, తాజా పరిణామాలపై మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Comments are closed.

Exit mobile version