ఈనెల 14వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు ‘ఉత్తుత్తి ఫైట్’ చేశారా? ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకోసం అధికార పార్టీ నేతలు అనేక మంది హృదయపూర్వక పోరాటం చేయలేదా? ఓ రకంగా చెప్పాలంటే ‘ఉత్తుత్తి’ యుద్దం మాత్రమే చేశారనే ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముగిసిన మూడోరోజు పార్టీకి చెందిన వివిధ వర్గాలు ఇదే అంశంపై ఆసక్తికర చర్చకు తెరలేపడం విశేషం. దీంతో బుధవారం ఓట్ల లెక్కింపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పల్లా’ గెలుపుపై ‘కాలర్’ ఎగురవేస్తూ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తున్నది. మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతల్లో చాలా మంది గుండె నిండుగా పల్లా గెలుపు కోసం పనిచేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పల్లా’ గెలుపుపై భిన్నప్రచారం వాడుకలోకి రావడం గమనార్హం.
పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే ‘పవర్ సెంటర్’గా మారుతారని, భవిష్యత్ రాజకీయాల్లో అది తమ ఉనికికే ప్రమాదకరంగా మారవచ్చని కొందరు ముఖ్య నేతలు ఆందోళన చెందారనే ప్రచారం జరుగుతోంది. అంతేగాక వివిధ అవసరాలపై గతంలో ‘పల్లా’ దర్శనం కోసం వెళ్లిన సందర్భంలో తమకు ఎదురైన ‘అనుభవాలు’ కూడా కొందరు నాయకులు బాగా గుర్తుపెట్టుకుని మరీ కష్టపడ్డారంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ జిల్లా పరిషత్ చైర్మెన్ కనీసం ‘పల్లా’కు ఓటు వేయాలని ఏ ఒక్క గ్రాడ్యుయేట్ నూ అభ్యర్థించిన దాఖలాలు లేవంటున్నారు. ఇది ఉదాహరణ మాత్రమేనని, పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా నామమాత్రపు ప్రచారం మాత్రమే నిర్వహించారంటున్నారు.
ఒకరిద్దరు మంత్రులు కూడా తొలుత పల్లా గెలుపును కాంక్షిస్తూ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదనే ప్రచారం కూడా ఉంది. అయితే విషయం తెలిసిన సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా వార్నింగ్ ఇవ్వడంతో అనివార్యంగా కష్టపడినట్లు నటించారని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గులాబీ పార్టీకి ‘సాలిడ్’ ఓట్లు పడతాయని భావించిన ప్రాంతాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా మారాయంటున్నారు. ‘పోల్ మేనేజ్మెంట్’ వ్యవహారాల్లో కొందరు స్థానిక నేతల చేతివాటం ఘటనలు కూడా పార్టీకి తీరని నష్టం చేకూర్చాయంటున్నారు. మొత్తంగా ‘పల్లా’ రాజేశ్వర్ రెడ్డి గెలుపుపై భిన్నాభిప్రాయాలకు ఇటువంటి కారణాలు అనేకంగా ఉదహరిస్తున్నారు. ‘పల్లా’ రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు ‘ఉత్తుత్తి ఫైట్’ చేశారా? రియల్ ఫైట్ చేశారా? అనే అంశాలకు ఫలితమే ప్రామాణికమనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.