పెద్దపల్లి-మంథని మెయిన్ రోడ్డు… మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతం… రెండు ఆర్టీసీ బస్సలు ఆగి ఉన్నాయి. ఓ బస్సు ముందు కారు, దానికి వ్యతిరేక దిశలో మరో కారు కనిపిస్తోంది. బస్సు ముందు గల కారు పక్కనే ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా నరుకుతున్నారు. ఈ ఘోర ఘటన జరుగుతున్న సమయంలోనే కొందరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ఈ లోగా ఇద్దరు వ్యక్తులు ‘నరకడం’ ముగించినట్లున్నారు. అక్కడే గల ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఆ తర్వాత వ్యతిరేక దిశలో గల కారులో కొందరు ఎక్కిన అనంతరం అది కూడా వెళ్లిపోయింది. హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల దారుణ హత్యకు సంబంధించిన వీడియో దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన జరుగుతున్నంత సేపు బస్సుల్లో గల ప్రయాణీకులుగాని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నవారుగాని ఎవరికీ ఏమీ పట్టలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే…
మరో విజువల్ లో కత్తిపోట్లకు గురై రక్తమోడుతున్న స్థితిలో అడ్వకేట్ వామన్ రావు నడిరోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్నారు. ఈలోగా ఎవరు సార్…? అనే ప్రశ్నకు కుంట శ్రీను… గుంజపడుగు అని వామన్ రావు బదులిచ్చారు. మంచీనీళ్లు అని వామన్ రావు అభ్యర్థిస్తున్నారు. ‘మంచినీళ్లు తాగొద్దు సార్..’ అంటున్నారు అక్కడే గల వ్యక్తి ఒకరు. తాను గట్టు వామన్ రావు అడ్వకేట్ అని రక్తమోడుతున్న దీనస్థితిలో వివరాలు కూడా చెప్పారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనూ రక్తపు మడుగులో గల వామన్ రావు పక్కనుంచే వాహనాలు కూడా రయ్…న వెడుతున్నాయ్. హైకోర్టు అడ్వకేట్ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటనా స్థలంలో ఈ రెండు దృశ్యాల్లో ఎవరూ వారిని రక్షించాలనే కనీస ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు.
మనం బీహార్ లో ఉన్నామా? తెలంగాణాలో ఉన్నామా? అని ప్రశ్నిస్తున్నారు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పోలీసుల తీరుపైనా ఆరోపణలు, విమర్శలు చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ను పోలీసులు వదిలేశారని ఆరోపించారు. ఎవరి ప్రమేయంతో ఇవన్నీ జరుగుతున్నాయని నిలదీశారు. అడ్వకేట్ దంపతుల దారుణ హత్యలపై సీబీఐ విచారణ జరపాలంటున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేళ… మీ ఇంట్లో పండుగ… ఇంకొకరి ఇంట్లో విషాదం… మీరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రిగారు… అని శ్రీధర్ బాబు ఘటనా స్థలంలో వ్యాఖ్యానించారు. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం జరిగిన గట్టు వామన్ రావు న్యాయవాద దంపతుల హత్యోదంతపు సీన్లు శ్రీధర్ బాబు ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నట్లేనా? ఇదీ జరుగుతున్న చర్చ.
ఫొటో: వామన్ రావు ప్రస్తావించిన టీఆర్ఎస్ లీడర్ కుంట శ్రీను