టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర పదవుల్లో గల నాయకులను మాత్రమే ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎందుకు ఎంపిక చేసినట్లు? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా మిగతా 32 జిల్లాలకు పార్టీ అధ్యక్షులగా నియమితులైన నాయకులందరూ ‘డబుల్ ధమాకా’ తరహాలో పదవుల లబ్ధి పొందినట్లు టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాలకు ఎమ్మెల్యేలను, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలను, మూడు జిల్లాలకు ఎంపీలను పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మిగతా ఏడు జిల్లాలకు వివిధ సంస్థల చైర్మెన్లను పార్టీ రథ సారథులుగా నియమించారు. వాస్తవానికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం అనేక మంది టీఆర్ఎస్ నేతలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఇతర సంస్థల చైర్మెన్లుగా ఉన్నవారినే పార్టీ అధ్యక్షులుగా నియమించడం వెనుక సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహమేంటి? ఇదీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.
వాస్తవానికి పార్టీ జిల్లా సారథుల ఎంపికలో సీఎం కేసీఆర్ రాజకీయంగా అంచనాలకు అందని విధంగా వ్యూహరచన చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు వస్తాయా? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెడతారా? అనే ప్రశ్నల సంగతి ఎలా ఉన్నప్పటికీ, పార్టీ సారథుల ఎంపిక కేసీఆర్ రాజకీయ చతురతకు నిదర్శనంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల పరిస్థితులను, పరిణామాలను విశ్లేషిస్తూ ఉదహరిస్తున్నారు. అవేమిటంటే…?
మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా స్థానిక ఎంపీ మాలోత్ కవితను నియమించారు. ఈ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని, తనకు గుర్తింపు లేకుండాపోయిందనే ఆవేదనను రెడ్యానాయక్ వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారపు సారాంశం. ఈ నేపథ్యంలో రెడ్యానాయక్ వంటి సీనియర్ నేత మంత్రి పదవిని ఆశించకుండా ఉండడానికి ఆయన కూతురైన ఎంపీ కవితకు జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను నియమించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అనుయాయుడిగా ప్రాచుర్యం పొందిన బడుగుల లింగయ్య యాదవ్ కు బీసీ కోటాలో అధ్యక్ష పదవి అప్పగించినప్పటికీ, పార్టీ పగ్గాలు పరోక్షంగా జగదీశ్వర్ రెడ్డి చేతిలో ఉన్నట్లుగానే భావిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని నియమించడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి ‘నోరు’న్న జీవన్ రెడ్డి సరైన నేతగా అంచనా వేసి ఉంటారంటున్నారు.
ఆయా జిల్లాల అధ్యక్ష పదవుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవిలో నియమించిన వ్యక్తి విషయంలో ‘కేసీఆర్ మార్క్’ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తాతా మధుసూదన్ కు ఇటీవలే ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ వెనువెంటనే జిల్లా అధ్యక్ష పదవిలో తాతా మధును నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పదవికి ప్రతిపాదిత పేర్లను తోసిరాజని సీఎం తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలను ఒక్కసారిగా విస్మయానికి గురి చేసిందంటున్నారు.
ఈ పరిణామాల్లోనే తాతా మధు ఎంపికపై భిన్న రకాల చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో పార్టీకి చెందిన పలువురు నాయకులు తమకు తాము రాజకీయ ఉద్దండులుగా, తోపులుగా అభివర్ణించుకుంటారని, అందుకు తగిన విధంగా వారి అనుచర, అనుయాయులు ప్రచారం చేస్తుంటారనే వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరునిగా ప్రాచుర్యం పొందిన తాతా మధును జిల్లా పార్టీ అధ్యక్ష పదవిలో కేసీఆర్ నియమించడం వెనుక భారీ వ్యూహం ఉందంటున్నారు. తాతా మధు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడు… పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు నమ్మినబంటుగా ప్రాచుర్యం పొందిన నేత. దరిమిలా బోధపడుతున్నదేమిటి? ఖమ్మం జిల్లాలో పార్టీ పగ్గాలు స్వయంగా కేసీఆర్ చేతిలో ఉన్నట్లే? చీమ చిటుక్కుమన్నా తాతా మధు నుంచి పల్లా ద్వారా నేరుగా సీఎం కేసీఆర్ చెవిలో పడినట్లే? ఉద్దండులు, తోపులుగా భావించుకునే నేతలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ సిఫారసు కోసం తాతా మధును ఆశ్రయించాల్సిందే. వారి పేర్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు సిఫారసు చేయాల్సిందే. మొత్తంగా ఖమ్మం జిల్లా పార్టీ వ్యవహారాలన్నీ ఇప్పుడు సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తాయన్నమాట. ఉద్ధండులుగా తమకు తాము అంచనా వేసుకునే స్థానిక నాయకులు వ్యవహరించాల్సిన తీరును తాతా మధు ఎంపిక ద్వారా సీఎం కేసీఆర్ నేరుగానే స్పష్టం చేసినట్లుగా పరిశీలకుల అంచనా. అనేక మంది నాయకుల వైఖరికి తాతా మధు ఎంపిక ద్వారా సీఎం కేసీఆర్ చెక్ పెట్టినట్లుగానూ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవిలో తాతా మధు ఎంపిక ఓ ఉదాహరణ మాత్రమేనంటున్నారు. ఏ జిల్లా ప్రత్యేకత, అక్కడి స్థానిక పరిస్థితులు, పరిణామాలను బట్టే అధ్యక్ష ఎంపికలు జరిగాయంటున్నారు. అంతిమంగా వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ పొలిటికల్ స్కెచ్ పై భారీ చర్చే జరుగుతోంది.