‘అంతెందుకు సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే నన్ను అడుగు’… అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్ధేశించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత నవంబర్ లో చేసిన ఈ వ్యాఖ్య ఇది… గుర్తుందిగా? ఇప్పుడీ వ్యాఖ్య ప్రస్తావన దేనికంటే… తెలంగాణాకు కాబోయే సీఎంగా ప్రాచుర్యంలో గల మంత్రి కేటీఆర్ ఇలాఖా సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు గుర్రుమంటున్నాయి. పార్టీకి చెందిన సీనియర్లు, ప్రజాప్రతినిధులు మామిడితోటల్లో సమావేశమవుతున్నారు. తమ పరిస్థితి ఏమిటో బోధపడక తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లలోనే కాదు, హైదరాబాద్ వెళ్లినా కేటీఆర్ సార్ దర్శనం లభించడం లేదని అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారట. గంపగుత్తగా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటామని అల్టిమేటం జారీ చేస్తున్నారట. ఈ పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర కలకలాన్ని కలిగిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం అధికార పార్టీకి పెట్టని కోటగానే చెప్పాలి. ఇందులో ఏ సందేహం లేదు. కేటీఆర్ వరుస విజయాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ కేటీఆర్ కష్టానికి మంచి మార్కులే ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. లేకపోతే టీఆర్ఎస్ సీనియర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఓ మామిడి తోటలో మంత్రి కేటీఆర్ వ్యవహార తీరును ఉటంకిస్తూ సమావేశం కావడమేంటి? ఇదీ రాజకీయ పరిశీలకుల ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలస వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకుల మాటలు మాత్రమే వింటున్నారని, నామినేటెడ్ పదవులను కూడా వాళ్లకే ఇస్తున్నారని, ఆదినుంచీ పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదనేది టీఆర్ఎస్ నేతల, కేడర్ ప్రధాన ఆరోపణ. అందువల్లే సిరిసిల్ల గులాబీ కేడర్ గంపగుత్తగా బీజేపీ జెండా కప్పుకునేందుకు సంసిద్ధమవుతున్నదట.
ఇందులో భాగంగానే తంగళ్లపల్లి మామిడితోటలో సమావేశమైన కేడర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి కేటీఆర్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ నేతలతో మాట్లాడేందుకు నిర్ణయించుకున్నారు. నిర్దేశిత తేదీల్లో హైదరాబాద్ వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు. ప్రక్రియలో భాగంగానే సంక్రాంతి పండుగకు ఓ రోజు ముందుగానే తంగళ్లపల్లి మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. మధ్యలో భోగి, సంక్రాంతి పర్వదినాలు రావడంతో రెండు రోజుల అనంతరం నేటి నుంచి మళ్లీ స్థానిక నాయకులతో మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం గంభీర్రావుపేట, 16వ తేదీన ముస్తాబాద్, 17న ఎల్లారెడ్డిపేట, 18న సిరిసిల్ల టౌన్ మండలాల వారితో కేటీఆర్ మాట్లాడనున్నారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు కథ వేరే ఉందనేది స్థానిక కేడర్ వాదన, కేటీఆర్ సొంత మేనబావ చీటీ నర్సింగరావు ఉద్యమకాలం నుంచి పార్టీకి అక్కడ వెన్నుదన్నుగా ఉన్నారట . ఆయన ప్రాధాన్యతను తగ్గించి, టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్ రావుకు మాత్రమే కేటీఆర్ ప్రాముఖ్యతనిస్తున్నారనేది అసలు కారణమట. ఇటీవల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పదవులను ప్రకటించగా, అన్నీ కొండూరి రవీందర్ రావు వర్గీయులకే దక్కాయని, ఇందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వలస వచ్చినవారేనని స్థానిక కేడర్ గుర్రుమంటోంది. ఈ పరిణామాల్లోనే సిరిసిల్లలో గులాబీ శ్రేణులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం సిరిసిల్లలో చోటుచేసుకున్న ఈ ‘సీన్’ను చూసి మంత్రి కేటీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే పార్టీ కేడర్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడవుతారని భావిస్తున్న కేటీఆర్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలకు, తాజా పరిణామాలకు ఏదేని పొంతన ఉందా? అనేది రాజకీయ పరిశీలకుల మీమాంస.