కరోనా వైరస్ ధాటికి విలవిలలాడుతున్న మన దేశానికి తాజాగా పాకిస్థాన్ మిడతల ముప్పు వచ్చి పడింది. రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంట పొలాలను మింగేస్తున్న మిడతలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలనూ భయపెడుతున్నాయి. కర్నాటక సరిహద్దుల్లో గల అనంతపూర్ జిల్లా రాయదుర్గం పట్టణంలోకి గురువారం మిడతలు ప్రవేశించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ మరో 48 గంటల్లో మిడతలు ప్రవేశించే అవకాశమున్నట్లు అధికారగణం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ మిడతలు తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్ధుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రోజుకు 150 కిలోమీటర్ల మేర ప్రయాణించే మిడతలు తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించడానికి మహా అయితే మరో రెండు రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిడతలు తెలంగాణాలోకి ప్రవేశిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఈమేరకు ప్రగతి భవన్ లో శాస్త్రవేత్తలతో, అధికారులతో ఆయన సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ మిడతలు ఎంత వేగంగా, ఎలా ప్రయాణిస్తాయో తెలుసా? వాటి జర్నీ తీరు ‘తుపాన్’ను తలపిస్తున్నది. అందుకు సంబంధించిన వీడియోను దిగువన చూడవచ్చు. అయితే ఈ వీడియో ఇండియాలో చిత్రీకరించినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే వాహనాలు కుడివైపున ప్రయాణిస్తున్నాయి. విదేశీ వీడియోనే కావచ్చు. కానీ మిడతల ప్రయాణాన్ని కళ్ల ముందు చూపుతోంది ఈ సీన్. ఇక చూసేయండి.