కోట్లాది రూపాయల విలువైన గంజాయిని వెహికిల్ టైర్ పంక్చర్ ఘటన పోలీసులకు పట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం వెలుగు చూసిన ఉదంతపు పూర్వాపరాలు ప్రాథమిక సమాచారం ప్రకారం… కొత్తగూడెం శివార్లలోని రామవరం వద్ద గత అర్ధరాత్రి దాటాక ఈ ఉదయం రెండు గంటల సమయంలో ఓ అంబులెన్స్ నడిరోడ్డుపై ఆగిపోయింది. తమ విధుల్లో భాగంగా పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఆగిన అంబులెన్స్ గురించి ఆరా తీశారు. టైర్ పంక్చర్ కావడంతో అంబులెన్స్ ఆగిందని వాహనంలోని వ్యక్తి చెప్పినట్లు సమాచారం.
అయితే అంబులెన్స్ కు తమిళనాడు వాహన రిజిస్ట్రేషన్ ఉండడంతో అక్కడి నుంచి ఇక్కడికి పేషెంట్ ఎవరు వచ్చారని పోలీసులు అంబులెన్స్ వెంట గల వ్యక్తిని ప్రశ్నించారు. వాహనంలో గల వ్యక్తి పోలీసుల ప్రశ్నకు తడబడ్డాడు. దీంతో అనుమానించిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ. 2.50 కోట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒరిస్సా నుంచి తమిళనాడుకు గంజాయిని అంబులెన్స్ లో తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.