ఒలింపిక్ లో పీవీ సింధు సాధించిన విజయం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినూత్నంగా స్పందించారు. ఇందుకు ఓ భారీ క్రేన్ ను ఉపయోగించడం విశేషం. పీవీ సింధు ప్రదర్శించిన ఆట, కాంస్య పతకం సాధించిన తీరు అద్బుతమని మంత్రి అజయ్ కుమార్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఈమేరకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని షటిల్ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ముఖ్య అతిధిగా హాజరై, కేక్ కట్ చేసి మీడియా ద్వారా సింధుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఇండోర్ స్టేడియానికి ఉన్న సింధు వాల్ పెయింటింగ్ కు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి స్వీట్ తినిపించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తు ఒలింపిక్స్ లో ఆడాలనుకునే మహిళలకు ఆమె గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన ఏకైక భారతీయురాలుగా సింధు చరిత్ర సృష్టించారన్నారు. సింధు మరెన్నో విజయాలు నమోదు చేసి దేశ ప్రతిష్టను, తెలుగు గౌరవాన్ని, మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని మంత్రి ఆకాంక్షించారు.