కొందరు నిరక్షరాస్యులను నిశితంగా పరిశీలించండి. వీళ్లు నిత్య కూలీలే. ఎంచక్కా భార్యా పిల్లలతో హాయిగా జీవిస్తుంటారు. ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బతికేస్తుంటారు. లేనివాటి కోసం అర్రులు చాచరు. ప్రపంచ పోకడలతో వారికి పెద్దగా సంబంధం ఉండదు. ఈరోజు బతికేందుకు పని దొరికిందా? నాలుగు రూకలు లభిస్తున్నాయా? సాయంత్రానికి ఇల్లు చేరి భార్యా, పిల్లలతో సంతోషంగా ఉన్నామా? లేదా? ఇదే వాళ్ల నిత్య జీవితం.

మరికొందరి జీవితాలను లోతుగా పరిశీలిస్తే, వాళ్లకు పెద్దగా ఆస్తి, పాస్తులేమీ ఉండవు. చాలీ చాలని జీతపు బతుకులే. కుబేరులు కావాలనే దురాశ వాళ్లకేమీ ఉండదు. కష్టాలు లేకుండా ఈ నెల ఇల్లు గడిస్తే చాలుననే ఆశ. మధ్య తరగతి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు సాధారణమే కావచ్చు. కానీ ఇటువంటి అనేక కుటుంబాల జంటలు చట్టాల గురించి పెద్దగా పట్టించుకోరు. సెక్షన్ల గురించి అసలే తెలియిదు. భార్యా, భర్తల మధ్య గొడవలు వస్తే మాట్లాడుకుంటారు. పోట్లాడుకుంటారు. అవసరమైతే కుటుంబ పెద్దలను పిలిపిస్తారు. పంచాయతీలు పెట్టిస్తారు. కొన్ని వర్గాల్లో ఈ పంచాయతీలు ఒకటి, రెండు రోజుల్లోనే తేలిపోతాయి. మరికొన్ని తెగల్లో రోజుల తరబడి సాగుతాయి. ఈ సాగడం వెనుక పంచాయతీ పెద్దల ఖర్చులు వగైరా ఉంటాయన్నది వేరే విషయం.

కానీ ఇటువంటి పేద, నిరుపేద, నిరక్షరాస్య వర్గాల్లో భార్యా భర్తల పంచాయతీలు వీలైనంత వరకు స్థానికంగానే సర్దుకుంటాయి. ఎందుకంటే ఇరు పక్షాల పెద్ద మనుషులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని తమదైన శైలిలో తీర్పులు చెబుతుంటారు. ఇందుకు స్థానికంగా గతంలో జరిగిన అనేక పంచాయతీలను, కలిసి ఉన్న కుటుంబాలను ఉదాహరణగా ఉటంకిస్తారు. కలిసే ఉండాలని నచ్చజెబుతారు. భార్యా, భర్తలను ఇందుకు ఒప్పిస్తారు. అవసరమైతే ఒప్పంద పత్రాలను రాయిస్తారు. పంచాయతీకి దిగిన భార్యా, భర్తల పేరెంట్స్ ను కూడా కొన్ని విషయాల్లో బాధ్యులను చేస్తారు. కొడుకు, కూతుళ్లకు నచ్చ జెప్పాలని, తప్పేమిటో, ఒప్పేమిటో వారికి అర్థమయ్యేలా వివరించాలని పెద్ద మనుషులు వారికి సూచిస్తారు. ఇటువంటి పంచాయతీలకు దిగే జంటలు దాదాపుగా మళ్లీ కలిసిపోతాయి. కలిసే ఇళ్లకు వెడతారు. పెద్ద మనుషులకు దండం పెట్టి మరీ. ఇక ముందు గొడవలకు దిగబోమని ప్రతిజ్ఞ చేస్తారు. మనం గ్రామాల్లో చూసే అనేకానేక పంచాయతీల్లో ఇటువంటి సీన్లు కనిపిస్తుంటాయి. తిట్టుకున్నా, కొట్టుకున్నా చివరికి కలిసి బతికేందుకే ఆ జంటలు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తాయి. అతి తక్కువ శాతం జంటలు మాత్రమే విడాకుల వరకు వెడతాయి. ఇది నిరక్షరాస్యులైన భార్యా, భర్తలకు సంబంధించిన పంచాయతీల తీరు.

తమ పెళ్లి సర్టిఫికెట్ ను చూపుతున్న మహేశ్వర్ రెడ్డి భార్య భావన (ఫైల్ ఫొటో)

ఇక ఉన్నత చదువులు చదువుకున్న భార్యా, భర్తల పంచాయతీలను తీర్చడం గ్రామాల్లోనే కాదు, నగరాల్లోని పెద్ద మనుషుల వల్ల కూడా కాదు. ఎందుకంటే ‘నువ్వెవరు మాకు చెప్పడానికి?’ తరహా చైతన్యం బాగా చదువుకున్న వారిలో అనేక మందికి ఉంటుంది. వినే ప్రసక్తే లేదంటారు. ఎందుకంటే బాగా చదువుకున్న తెలివితేటలు కొందరిలో అపారంగా ఉంటాయి కాబట్టి. లిటిగేషన్ వ్యవహారాలపై మరికొందరికి గట్టి పట్టు ఉంటుంది కాబట్టి. నేను బాగా చదువుకున్నాననే అహం పలువురిలో ఉంటుంది కాబట్టి. తానేమీ తక్కువ సంపాదించడం లేదనే భావన అనేక మందిలో ఉంటుంది కాబట్టి. ‘వినదగునెవ్వరు చెప్పిన…’ సుమతీ శతకపు నీతి గురించి తెలుసుకునే ఓపిక చాలా మందికి ఉండదు కాబట్టి. మొత్తంగా తాము బాగా చదువుకున్నామనే ధీమా కొందరిలో ఉంటుంది కాబట్టి. తమకు సర్వం తెలుసనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకొందరిలో ఉంటుంది కాబట్టి. అందుకే కాబోలు.. ఎక్కువగా చదువుకున్న అనేక జంటలు అనవసర పంచాయతీలకు దిగి ఒంటరి అవుతున్నాయనే వాదన అనేక సందర్భాల్లో వినిపిస్తుంటుంది.

ఇదంతా ఎందుకు చెప్పకుంటున్నామంటే..ట్రెయినీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి కేసు గురించి తెలుసు కదా? ఆయన భార్య ఫిర్యాదు నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వును హైదరాబాద్ లోని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిన్న కొట్టేసింది. మహేశ్వర్ రెడ్డిని తిరిగి ట్రెయినింగ్ లోకి తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ పోలీస్ అకాడమీని ఆదేశించింది. ఈ ఘటనలో మహేశ్వర్ రెడ్డి కేసు చివరికి ఏమవుతుందన్నది ఇక్కడ విషయం కాదు. ఈ సందర్భంగా క్యాట్ ఛైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్ ల ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవేమిటంటే…

‘‘బెంగుళూరు నగరంలోని పది ఫ్యామిలీ కోర్టుల్లో విడాకుల కోసం వచ్చేవారిలో అత్యధికులు ఉన్నత చదువులు చదివిన వారే. వాళ్లలో చాలా మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. వారందరినీ సస్పెండ్ చేస్తే బెంగళూరు సగం ఖాళీ అవుతుంది.’’

విషయం బోధపడినట్లేగా? చదివేస్తే ఉన్న మతి పోవడమంటే ఇదే కాబోలు. ఈ తరహాకు చెందిన అనేక కేసుల్లో ఉన్నత చదువులు చదివిన వారికి ఎవరు చెప్పాలి? కాపురంలో కలహాలు ఎన్ని ఉన్నా, కారణాలు ఏవైనప్పటికీ భార్యా, భర్తలు కలిసే ఉండాలని? పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి జీవించాలని??

Comments are closed.

Exit mobile version