తెలంగాణా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంత్రి పదవి గురించి కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే వారమే ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని రాజేందర్ మెడకు చుట్టబోతున్నారని, ఆయనను బాధ్యునిగా చేస్తూ మంత్రి వర్గం నుంచి తొలగించనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు కనీసం 50 వేల మందికి కూడా కరోనా వైద్య పరీక్షలు చేయలేదన్నారు. తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పిందని బూచీ చూపిస్తూ మంత్రి ఈటెలను వచ్చే వారం మంత్రి పదవి నుండి తప్పించబోతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కరోనా బాధితుడికి 3.5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, జర్నలిస్టు మనోజ్ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని రేవంత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
జర్నలిస్టు మనోజ్ మృతి, ప్రభుత్వ సహాయంపై నిరసనగా జర్నలిస్టులు చేపట్టిన ఉపవాస దీక్షలకు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు నిరసన చేపట్టారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థం చేసుకోవాలన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోద ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారని, అదే సగటు మనిషికి కరోనా వస్తే గాంధీలో చికిత్స అందిస్తున్నారని రేవంత్ అన్నారు. తనవంతు సహాయంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించి చెక్కును అందజేశారు.