తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోనని, నిర్ణయాలు పార్టీ మాత్రమే తీసుకంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ గా నియమితుడైన రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదని, సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయన్నారు. తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందని, అయితే అది ఎప్పుడనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను విమర్శించడం వికృత చర్యగా రేవంత్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం తాను అండగా ఉంటానని, వారి కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లింగోజిగూడ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. లింగోజిగూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినందుకు బీజేపీ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పటిలోగా తీసుకుంటారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షునిగా వచ్చే నెల 7న మధ్యాహ్నం 1.30 గంటలకు బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో ఎంఐఎం బలమెంతో బీజేపీ బలం కూడా అంతేనని వ్యాఖ్యానించారు. అయోధ్యలో భూముల వ్యవహారంలో బీజేపీ రాముడిని కూడా తెగనమ్ముకుందని ఆరోపించారు. రాముడి పేరు చెప్పుకోవడానికి బీజేపీ నాయకులకు అర్హత లేదని, మోదీ ఇప్పుడు గడ్డం పెంచి సన్యాసి అవతారం ఎత్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.