అదేమిటి…? బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు మున్సిపల్ కార్పొరేటర్ మాత్రమేనా? ఆయన ఎంపీగా గెలిచారనే విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా గుర్తించలేదా? అవేం ప్రశ్నలు… అనుకుంటున్నారా? అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవలసిందే.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ నిన్న ‘సర్జికల్ స్ట్రైక్’ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్’ చేస్తామని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య తీవ్ర విమర్శలకు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయ్ కూడా.

ఈ పరిణామాల్లోనే మన తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులవారు… అనగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా సంజయ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో సంజయ్ కు తెలుసా? నేను యుద్ధం చేసి వచ్చా… నాకు తెలుసు అనే తరహాలో విమర్శల పర్వాన్ని అందుకున్నారు.

పనిలో పనిగా సంజయ్ ను చిల్లర కార్పొరేటర్ గా అభివర్ణించారు. అయినా ఓ కార్పొరేటర్ ను తీసుకువచ్చి అధ్యక్షున్ని చేస్తే ఇలాగే ఉంటుందని కూడా ఉత్తమ్ సార్ మండిపడ్డారు. అంతా బాగానే ఉందిగాని, బండి సంజయ్ కార్పొరేటర్ నుంచి నేరుగా బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కాలేదనే విషయంపై ఉత్తమ్ కు క్లారిటీ లేనట్లుంది.

ఔను… బండ్ సంజయ్ ఏడాదిన్నర క్రితం వరకు కూడా కార్పొరేటరే అందులో ఏ సందేహం లేదు. అంతకు ముందు కౌన్సిలర్ కూడా. దాదాపు నాలుగుసార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా ప్రజలు సంజయ్ ను గెలిపించారు. కానీ, మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

తనతోపాటు పార్లమెంటులో అడుగిడిన సంజయ్ ను ఉత్తమ్ ఇంకా కార్పొరేటర్ గా, ఇంకా వివరంగా చెప్పాలంటే ‘చిల్లర కార్పొరేటర్’గా అభివర్ణించడమే చర్చకు దారి తీసింది. అందువల్ల ఉత్తమ్ సార్ సంజయ్ గురించిన పూర్తి సమాచారాన్ని ‘అప్ డేట్’ చేసుకోవలసి ఉంటుందేమో కదా!

Comments are closed.

Exit mobile version