తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరికొత్త నినాదం అందుకున్నారు. ‘నికార్సయిన కాంగ్రెసోడా…’ అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తుండడం ఆసక్తికరం. ఈనెల 7వ తేదీన టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు పార్టీలోని సీనియర్ నేతలను కలుస్తూనే, ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరుబాట పట్టారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ రేవంత్ సరికొత్త నినాదాన్ని ఇస్తుండడమే అసలు విశేషం. ‘నికార్సయిన కాంగ్రెసోడా.. నిరసిద్దాం కదలి రా…!’ అంటూ రేవంత్ నినదిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 16వ తేదీన ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమానికి ఇచ్చిన తాజా పిలుపులోనూ ఈ నినాదం కాంగ్రెస్ కార్యకర్తలను ఆకర్షిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై పన్ను… విరిచేస్తోంది గరీబోడి వెన్ను…!’ అంటూ యతి, ప్రాసల నినాదాలతో రేవంత్ రెడ్డి పిలుపునిస్తుండడం గమనార్హం. మొత్తంగా ‘నికార్సయిన కాంగ్రెసోడా..’ అనే పదం కాంగ్రెస్ కేడర్ లో నూతనోత్తేజాన్ని నింపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.