జైల్లో చిప్పకూడు గురించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో రేవంత్ రెడ్డి తాను జైల్లో గడిపిన పరిస్థితులను, పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. తాను కుర్చీకోసమే పాకులాడేవాడినైతే అధికార బీజేపీలోనే చేరేవాడినని చెప్పారు. కానీ తాను తెలంగాణా ప్రజలకు పట్టిన చీడను వదలించడానికే ప్రయత్నిస్తున్నానని, ఇందులో భాగంగానే తెలంగాణా ప్రజల కలలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి, సోనియా గాంధీ ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. సుదీర్ఘ డిబేట్ లో ‘చిప్పకూడు’ పదాన్ని ఉచ్ఛరిస్తూ రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే…
‘కష్టాలొచ్చినా, కేసులొచ్చినా, జైలుకుబోయిన, చిప్పకూడు తిన్న… ఎస్.. చిప్పకూడు రెండుసార్లు తిన్నా.. ఒక్కసారి కాదు.. కేసీఆర్ తో కొట్లాడడానికి వందసార్లు చిప్పకూడు తింటా. నా కార్యకర్తల కోసం వెయ్యి సార్లు జైలుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండోసారి నన్ను జైలుకు పంపిచ్చినపుడు ఐఎస్ఐవాళ్లు, టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉండే డిటెన్షన్ సెల్ లో పదిహేను రోజులు పెడితే కూడా, ఎంపీగా నాకు స్పెషల్ కేటగిరీ అవకాశమున్నా, జైల్లో ప్రత్యేక వసతులున్నా అటువంటి సెల్ లో ఉన్నా. నన్ను మానసికంగా కుంగదీయడానికి యావత్ బారికేడ్ ను ఖాళీ చేసి నన్ను ఒక్కన్ని డిటెన్షన్ సెల్ లో రోజులకొద్దీ నిర్బంధించినా కూడా ఒక్కన్ని రాత్రీ, పగలు జైల్లో ఉన్నా. నేను చేసిన నేరం ఏముంది? డ్రోన్ నేను ఎగురవేస్తానా? రూ. 200 ఫైన్ కట్టాల్సిన కేసులో పదిహేను రోజులు జైలుకు పంపిస్తే కూడా నా మనో నిబ్బరాన్ని కోల్పోలేదు’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణా కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల దుఃఖం ముందు తాను చేసింది పెద్ద త్యాగమే కాదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. ‘దిమ్మెల మీద పడుకోవడం, జైల్లో నాలుగు గోడల మధ్య పడుకోవడం పెద్ద త్యాగమా? ఇవన్నీ నాకేం అవసరం? నాకు జూబ్లీ హిల్స్ లో బంగళాలు ఉన్నయ్, కార్లున్నయ్, ఏసీలున్నయ్, నాలుగు తరాలు తినడానికి ఆస్తి ఉంది’ అని చెప్పారు. అయినప్పటికీ ఇవన్నీ తాను ఎందుకు భరిస్తున్నానంటే… తెలంగాణా ప్రజలకు పట్టిన పీడను, చీడను విరుగడ చేసేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏ ఆకాంక్షల కోసం, త్యాగాల పునాదుల మీద తెలంగాణా ఏర్పడ్డదో, తెలంగాణా ప్రజల కోసం ఒక గొప్ప రాజకీయ త్యాగం చేసిన సోనియాగాంధీ గౌరవాన్ని నిలబెట్టడానికి, ఆమె కన్న కలలను సాకారం చేసేందుకే, సోనియమ్మ రాజ్యం తెచ్చేందుకే, సోనియా ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక, స్వయం పాలనకోసం నిర్దిష్టంగా తెలంగాణా ప్రజల ఆకాంక్షల కోసం నిస్వార్థంగా పనిచేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.