మావోయిస్టు పార్టీ అగ్ర నేత ఒకరు తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న జజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క డీజీపీ ముందు లొంగిపోయారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రానికి చెందిన శారదక్క అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితురాలై 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు.
గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ నేతృత్వంలోని పాండవ దళంలో సభ్యురాలిగా అజ్ఞాత జీవితం ప్రారంభించిన శారదక్క పార్టీలోనే హరిభూషణ్ ను పెళ్లి చేసుకున్నారు.
అనంతర పరిణామాల్లో అనారోగ్య కారణాలతో 2009లో పోలీసులకు లొంగిపోయిన శారదక్క తిరిగి 2012లో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే హరిభూషణ్ మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటి సభ్యుడిగా ఎదగడంతో పాటు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే అనూహ్యంగా హరిభూషణ్ కరోనా బారిన పడి గత జూన్ 21వ తేదీన మరణించారు.
అప్పట్లో హరిభూషణ్ తో పాటు శారదక్క కూడా మృతి చెందిదనే వార్తలు వచ్చాయి. కానీ శారదక్క మృతి చెందలేదంటూ పార్టీ ప్రకటించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగానూ శారదక్క పనిచేశారు. శారదక్క లొంగుబాటు అంశాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.