ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా తొర్రెం (జీరగూడెం) ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో సోషల్ మీడియా వేదికగా హిందీ, తెలుగు భాషల్లో సుదీర్ఘ పత్రికా ప్రకటన వెలువడింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో సామ్రాజ్యవాద అనుకూల, ప్రజావ్యతిరేక ఫాసిస్టు మోడీ ప్రభుత్వ పోలీసు బలగాలు తమపై దాడికి వచ్చాయన్నారు. అయితే తమ పార్టీకి చెందిన పీఎల్జీఏ బలగాలు ప్రతిదాడి చేశాయన్నారు. వేలాది సంఖ్యలో వచ్చిన పోలీసు బలగాలపై పీఎల్జీఏ బలగాల ప్రతిఘటనలో 23 మంది పోలీసులు మరణించారని, మరో జవాన్ తమకు బందీగా దొరికాడని వికల్ప్ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ సంఘటనలో 30 మందికిపైగా గాయపడగా, మిగిలినవారు పారిపోయారని, ఈ ఘటనకు ముందే జీరగూడెం గ్రామానికి చెందిన మాడవి సుక్కాలును పట్టుకుని కాల్చి చంపి, ఎప్పటిలాగే కాల్పుల్లో చనిపోయాడని బూటకపు ప్రచారం చేశారన్నారు.
ఈ దాడిలో ఓడి సన్ని, పద్దమ్ లక్కా, కోవాని భద్రు, నూప సురేష్ అనే నలుగురు పీఎల్జీఏ సభ్యులు వీరోచితంగా పోరాడి అమరులయ్యారని, అయితే సన్నీ డెడ్ బాడీని తాము తెచ్చుకోలేకపోయామన్నారు. నిజానికి పోలీసులు తమకు శత్రువులు కాదని, పాలకవర్గాలు తెచ్చిపెట్టిన అన్యాయమైన యుద్ధంలో బలిపశువులు కావద్దని తాము వారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సంఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని, దాడిలో 14 ఆయుధాలను, 2,000కు పైగా తూటాలను, మరికొంత యుద్ధసామాగ్రిని పీఎల్జీఏ స్వాధీనం చేసుకున్నట్లు వికల్ప్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేశారు.
అదేవిధంగా జీరగూడెం దాడి తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగదల్ పూర్ కు వచ్చి మావోయిస్టు వ్యతిరేక సైనిక దాడిని మరింత తీవ్రతరం చేసి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారని, ఈ పరిస్థితుల్లో ప్రజలను, వనరులను, ప్రజాసంపదను కాపాడుకోవడంలో భాగంగా పీఎల్జీఏ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిదాడి చేయవలసి వస్తుందన్నారు. ఇదే సందర్భంగా వికల్ప్ చర్చల అంశాన్ని ప్రస్తావిస్తూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని, బలగాలతో దాడులు చేస్తున్నందుకే కొండగాం, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన ప్రతిదాడుల్లో పోలీసులు చనిపోవలసి వచ్చిందని, ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే తమవద్ద బందీగా ఉన్న పోలీసును అప్పగిస్తామని, అప్పటి వరకు అతను జనతన సర్కార్ల రక్షణలో క్షేమంగా ఉంటాడని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేర్కొన్నారు.
ఫీచర్డ్ ఇమేజ్: ఎన్కౌంటర్ ఘటనలో పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు నక్సల్ నేత ప్రకటించిన ఆయుధాలు