ఎవరికీ లభించని అవకాశం మనకు మాత్రమే లభించినపుడు అదో తృప్తి. ఎవరూ చేయని సాహసం మనం చేసినపుడు ఎప్పటికీ చెరగని సంతృ ప్తి. మనం చేశాక ఆ టాస్క్ ను మరెవరూ చేయకపోవడం, ఇంకెవరికీ ఆ అవకాశం దక్కకపోవడం వృత్తిపరమైన సంతృప్తి. ఈ తరహా సంతృప్తి జర్నలిస్టుకు లభించినపుడు, ఇది గుర్తుకు వచ్చే ఘటన చోటు చేసుకున్నపుడు ఫ్లాష్ బ్యాక్ కళ్ల ముందు కదలాడుతుంటుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్న మరణం ఈ కోవలోకే వస్తుంది.
మూడున్నర దశాబ్ధాలకు పైగా సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ను ఇంటర్వ్యూ చేసే తొలి, చివరి అవకాశం నాకే దక్కడం జర్నలిస్టుగా మర్చిపోలేని అనుభూతి. నక్సలైట్ నేత ఇంటర్వ్యూ అంటే ఖమ్మం కలెక్టరేట్ వెనుక భాగాన గల చిట్టడవి లాంటి చెట్ల మధ్యన నిల్చుని, అదేదో టీవీ రిపోర్టర్ పీ-టూ-సీ చెబుతూ ఇవే ఛత్తీస్ గఢ్ అడవులు అంటూ భ్రమింపజేసినంత సులభం కాదు మరి. నేను సాక్షి పత్రికకు ఖమ్మం బ్యూరో ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, దాదాపు పదేళ్ల క్రితం అప్పటి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకష్ణారెడ్డి గారి నుంచి ఓ చిన్న ఆదేశం లాంటి అసైన్మెంట్. ‘మన పత్రికలో అన్ని అంశాలు ఉన్నాయి…కానీ ఒకే ఒక లోటు కనిపిస్తోంది.‘ అని సజ్జల గారు అన్నారు. ఏమిటి సర్? అని నేను అడగ్గా, ‘మన పేపర్ లో అన్నీ బావున్నాయి గాని, నక్సలైట్లకు సంబంధించిన ఏదేని వార్త ఉంటే బాగుంటుంది, అదీ ఎవరైనా నక్సల్ నాయకుని ఇంటర్వ్యూ అయితే ఇంకా మంచిది. అదొక్కటే లోటుగా కనిపిస్తోంది’ అని ఆయన స్పష్టం చేశారు. అప్పటికే ఛత్తీస్ గఢ్ లోని చింతల్ నారలో కోబ్రా, సీఆర్ఫీఎఫ్ వంటి పోలీసు బలగాలపై మావోయిస్టు నక్సలైట్లు విరుచుకుపడుతున్నారు. మావోల మెరుపు దాడుల కారణంగా పోలీసులు భారీ సంఖ్యలో మత్యువాత పడ్డారు. ఇదిగో ఇటువంటి సందర్భంలోనే మావోయిస్టు పార్టీ నుంచి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. కానీ ఛత్తీస్ గఢ్ అడవుల్లో నక్సలైట్లకు, పోలీసులకు భీకర పోరాటం జరుగుతున్న ప్రతికూల పరిస్థితుల్లో వెళ్లడం అవసరమా? అనే సందేహం కూడా కలిగింది.
కానీ ఏటూరునాగారం అడవుల్లో పుట్టి, పెరిగిన వాతావరణం నేర్పిన ధైర్యం వల్ల కావచ్చు… మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు ఇంటర్వ్యూ కోసం అడవి బాటకే ఉద్యుక్తమయ్యాను. ఫొటో జర్నలిస్టు రాధారపు రాజును వెంటేసుకుని దాదాపు 150 కిలోమీటర్లు పయనించాను. అక్కడికి వెళ్లేసరికి సాయంత్రమైంది. ఆ రాత్రి అక్కడే సేదతీరి, మరుసటి రోజు తెల్లవారు జామునే మరో 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణం. ఓ చిన్నపాటి ఊళ్లో ఆగాక, మమ్మల్ని తీసుకువెళ్లాల్సిన వ్యక్తి (కొరియర్) కోసం వేచి చూస్తున్నాం. దాదాపు మూడు గంటల అనంతరం రావలసిన వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని చూస్తూ అటూ, ఇటూ తచ్చాడుతూ తిరుగుతున్నాడే తప్ప, మా వద్దకు మాత్రం రావడం లేదు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి మమ్మల్ని చూపి, కొరియర్ కు సైగ చేసి వెళ్లిపోయాకగాని, ఆ వ్యక్తి మా వద్దకు రాలేదు. మేం తీసుకువెళ్లిన వాహనం ఇక ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. మోటార్ సైకిళ్లపై పయనించాల్సి ఉంటుందని కొరియర్ చెప్పాడు. కానీ మా వద్ద ఎటువంటి బైక్స్ లేవు. స్థానికంగా ఉన్న మరో విలేకరి సహాయాన్ని కోరాం. బైక్ లు ఏర్పాటు చేసిన స్థానిక విలేకరి తానూ వస్తానని పట్టుబట్టాడు. మేం కొరియర్ వంక చూశాం. స్థానిక విలేకరి రాకను అతను అంగీకరించాడు. రెండు బైకులపై నలుగురం. ఓ బైక్ ను నేనే స్వయంగా నడుపుతున్నాను. మరో బైక్ ను కొరియర్ నడుపుతున్నాడు. కాలి నడక బాటన రెండు బైకులపై అడ్డదిడ్డంగా పయనం. చెట్టూ, చేమల మధ్య నుంచి బైక్ నడపడం ఏటూరునాగారం అడవుల్లో అలవాటు ఉండడం వల్ల నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ కొరియర్ నడుపున్న వేగంతో సమానంగా నేను బైక్ నడపలేకపోయాను. ఓ గంటన్నర సేపు బైక్ విన్యాస పయనం అనంతరం ఓ ఊరు వచ్చింది. మమ్మల్ని తీసుకువెళ్లిన కొరియర్ కనిపించడం లేదు. దాదాపు గంట సేపు అదే ఊళ్లో ఓ గుడిసె ముందు నులక మంచపై కూర్చుండిపోయాం. ఆ తర్వాత మమ్మల్ని తీసుకువెళ్లిన కొరియర్ మరో ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని వచ్చి, మమ్మల్ని వాళ్లకు పరిచయం చేసి అతను వెళ్లిపోయాడు. మళ్లీ బైకులపై దట్టమైన అటవీ ప్రాంతం గుండా పయనం. ఈసారి రెండు బైకులపై అయిదుగురి పయనం. ఓ రెండు గంటల జర్నీ తర్వాత ఇక బైక్ లు నడవవు అని రెండోసారి వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. కాలి నడకే శరణ్యమన్నారు.
చేసేది లేక బైకులు అక్కడే వదిలేసి కాలి నడకప ప్రారంభించాం. ఓ రెండు గంటలు నడిచాక చిన్న ఆదివాసీ గూడెం వచ్చింది. సమయం మిట్ట మధ్యాహ్నం, దాదాపు మూడు గంటలు కావస్తోంది. కడుపులో ఎలుకలు పరుగెడుతున్న సవ్వడి. మా బాధను ముందే పసిగట్టారు కాబోలు. ఓ గిరిజన మాత చిన్న సర్వల్లో (చెంబులు) ఓ ద్రవ పదార్థాన్ని తీసుకువచ్చింది. నాతోపాటు మిగతా నలుగురు ద్రావక రూపంలో గల అంబలిని సేవించాం. అందరూ బాగానే ఉన్నారుగాని, మాతోపాటు వచ్చిన స్థానిక విలేకరి భల్లున వాంతి చేసుకున్నాడు. అంబలి అలవాటు లేని ఫలితమిది. మరో గంట సేపు అక్కడే కూర్చోవలసి వచ్చింది. మమ్మల్ని అక్కడి వరకు తీసుకువెళ్లిన ఇద్దరు వ్యక్తులకు మరో వ్యక్తి తోడయ్యారు. అతను మా వద్దకు వచ్చి ఇంకో పది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని చెప్పాడు. నాతోపాటు వచ్చిన స్థానిక విలేకరి బావురుమన్నాడు.. వామ్మో ఇక నడవడం నా వల్ల కాదన్నాడు. తాను ఇక్కడే ఉంటానని తేల్చాడు. కానీ కొరియర్లు అందుకు అంగీకరించలేదు. తమతోపాటు రావలసిందేనని, ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాతోపాటే అతను కూడా నడక ప్రారంభించాడు. ఓ రెండు గంటల తర్వాత మరో గిరిజన గూడేనికి చేరుకున్నాం. అక్కడ కాసేపు చెట్ల నీడన సేద తీరాం. మమ్మల్ని తీసుకువెళ్లిన వ్యక్తులు ఎంతకీ కానరావడం లేదు. ఓ గంట తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి తనను అనుసరించాలని కోరాడు. అక్కడి నుంచి దాదాపు అరగంట సేపు మళ్లీ కాలినడక. ఈ చివరి అరగంట కాలినడక సాగుతున్న సమయంలోనే దశల వారీగా సాయుధులైన నక్సలైట్లు అనేక మంది దారి పొడవునా కాపలా కాస్తున్న దృశ్యాలు కనిపించాయి. అంటే నేను ఇంటర్వ్యూ చేయాల్సిన నాయకుడి సమీపానికి చేరుకుంటున్నట్లు స్పష్టమమవుతోంది. మరికాసేపు కాలి నడక సాగాక అడవిలోనే గల ఓ చిన్నపాటి పాకలో నన్ను, నాతోపాటు గల ఫొటో జర్నలిస్టు రాధారపు రాజును, స్థానిక విలేకరిని కూర్చోబెట్టి వాళ్లు వెళ్లిపోయారు. హమ్మయ్య…అనుకుంటూ పాకలో కూర్చున్న కొద్ది సేపటికి మేం కూర్చున్న పూరి పాకను దాదాపు వంద మంది సాయుధ నక్సలైట్లు చుట్టుముట్టారు. మమ్మల్ని పరికిస్తూనే చుట్టూ గల ఆకు చప్పుడును సైతం వాళ్లు రిక్కరించి మరీ వింటున్నారు.
ఓ అరగంట తర్వాత ఏకే-47 తుపాకీని ధరించిన వ్యక్తి ఒకరు వచ్చి నన్ను నఖశిఖ పర్యంతరం తనిఖీ చేశాడు. ఆ తర్వాత ఫొటో జర్నలిస్టు రాజు కెమెరా బ్యాగును కూడా చెక్ చేశాడు. ‘పిలిచి ఇలా తనిఖీ చేయడ ఏమిటి? ఇది పద్ధతి కాదు’ అని నేను నా శైలిలో అభ్యంతరం తెలిపాను. ‘అన్నా, అపార్థం చేసుకోకండి. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మేట్టు లేదు. మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ఇంటర్వ్యూకు పిలిచాం. కానీ మా ముఖ్య నేత ప్రాణాలు మాకు అత్యంత ముఖ్యం. ఆయనను రక్షించుకునేందుకే తప్ప మిమ్మల్ని అనుమానించి కాదు. ఏవేని షార్ట్ వెపన్స్ ఉన్నాయేమోనని చెక్ చేస్తున్నారు. బాధ పడకండి అన్నా.’ అని నా వెనుక నుంచి మరో సాయుధ నక్సలైట్ నన్ను సమాధానపర్చాడు. ఈ తనఖీ ప్రక్రియ పూర్తయ్యాక కొద్ది సేపటికే ఓ వ్యక్తి వచ్చి, తనను తాను రామన్నగా పరిచయం చేసుకున్నాడు. మా పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాడు. అనేక అంశాలపై సుదీర్ఘమైన ఇంటర్వ్యూ సాగింది. దట్టమైన ఛత్తీస్ గఢ్ అడవుల్లో దాదాపు గంటన్నరపాటు సాగిన ఇంటర్వ్యూ సందర్భంగా రామన్న చుట్టూ అయిదంచెల వ్యవస్థను తలపిస్తూ భద్రతగా ఉన్న సాయుధ నక్సలైట్ల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు అయిదు వందల మంది. అందరూ ఎస్ఎల్ఆర్, కార్బన్, ఏకే-47 వంటి అధునాతన ఆయుధాలను ధరించినవారే. తిరుగు ప్రయాణంలో వస్తున్న సందర్భంగా అయిదు చోట్ల వివిధ ప్రాంతాల్లో వలయాకారంలో మాకు కనిపించిన భద్రతా దృశ్యాలు మావోయిస్టు పార్టీకి రామన్న ఎంత ముఖ్య నేత అనే విషయాన్ని స్పష్టం చేశాయి
సరే, ఇంటర్వ్యూ ముగసింది. ఎక్కడైతే మేం తీసుకువెళ్లిన బైకులు ఉన్నాయో, అక్కడికి చేరుకుని తిరిగి బయలుదేరాం. ఓ పావుగంట సేపు బైకులపై పయనిస్తుండగానే ఆకాశంలో హెలీకాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. మా వెంట గల ఇద్దరు కొరియర్లు అకస్మాత్తుగా బైక్ పక్కన పడేసి చెట్ల పొదల్లో దూరారు. వాళ్లను చూసి మేమూ అదే పని చేయక తప్పలేదు. ఎందుకంటే అప్పట్లో అడవుల్లో నక్సల్ ఆనవాళ్లు కనిపిస్తే హెలీకాప్టర్ల నుంచి భద్రతా బలగాలకు చెందిన పోలీసులు బాంబులు జార విడిచేవాళ్లనే వార్తలు ఉన్నాయి. దీంతో హెలీకాప్టర్లను చూసి చెట్ల పొదల్లో దూరక తప్పలేదు. ఎట్టకేలకు తిరుగు పయనంలో రాత్రి పది గంటల ప్రాంతానికి ఓ గిరిజన పల్లెకు చేరాం. ఇక పయనించలేక ఓ వ్యక్తిని బతిమాలి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించాం. మరుసటి రోజు ఉదయం బయలుదేరి మధ్యాహ్నానికి ఖమ్మం జిల్లాలోకి అడుగిడాం.
ఇటువంటి పరిస్థితుల్లో, అప్పట్లో నేను చేసిన రామన్న ఇంటర్వ్యూ మీడియాకు మొట్ట మొదటిదే కాదు, చిట్ట చివరిది కూడా. తన మూడున్నర దశాబ్ధాల ఉద్యమ పయనంలో రామన్న తన పేరున పత్రికా ప్రకటనలు జారీ చేసిన ఉదంతాలు కూడా అరుదే. నేను చేసిన ఇంటర్వ్యూకు ముందుగాని, తర్వాత గాని రామన్న మరే పత్రికకు, ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు.
మూడు దశాబ్ధాలకుపైగా నా జర్నలిజపు పయనంలో సత్తెన్న, చలమన్న, సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్, అనుపురం కొమురయ్య అలియాస్ ఏకే వంటి అనేక మంది నక్సల్ నేతలను ఇంటర్వ్యూ చేశాను. వాళ్లు నిర్వహించిన ప్రెస్ మీట్లకు కూడా హాజరయ్యాను. కానీ రామన్నను ఇంటర్వ్యూ చేసిన అనుభూతి ఎప్పటికీ మరువలేనిది. ఎందుకో తెలుసా…? చింతల్ నార్ ఘటనలో ఓ పోలీసు సాహస పోరాటాన్ని రామన్న ప్రశంసంచడం. శరీరంలో దాదాపు నాలుగైదు బుల్లెట్లు దూసుకువెళ్లినప్పటికీ ఆ పోలీసు తన తుదిశ్వాస వరకు తమతో పోరాడాడని, అతని పోరాట పటిమ తనను ఆశ్చర్యపరిచిందని రామన్న తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. విప్లవ పార్టీకి చెందిన ఓ అగ్రనేత శత్రువుగా భావించే పోలీసు పోరాటాన్ని మెచ్చుకోవడం బహుషా ఎక్కడా విని ఉండరు కదూ!
-ఎడమ సమ్మిరెడ్డి