రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ కార్యదర్శి. తన తలపై దాదాపు రూ. 40 లక్షల నగదు రివార్డు గల మావోయిస్టు పార్టీ అగ్ర నేత. ఇంతకీ రామన్న జీవించే ఉన్నారా? లేక గుండెపోటుతో మరణించారా? ఇవీ ఇప్పటికిప్పుడు నిర్ధారణతో కూడిన జవాబు లేని ప్రశ్నలు. కానీ రామన్న భౌతిక స్థితిపై దాదాపు ఐదు రాష్ట్రాల పోలీసులు మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దశలోనే కొందరు పోలీసు అధికారుల హోదాతో రామన్న మరణించినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ వైరల్ గా మారడం గమనార్హం.

ఒడిషాకు చెందిన ఓ వెబ్ సైట్ రాసిన వార్తా కథనపు శీర్షిక

రామన్న గుండెపోటుతో మరణించినట్లు వార్తలు ప్రసారం చేసిన ఇతర రాష్ట్రాల మీడియా సంస్థలు ప్రస్తుతం ఆ అంశంపై మిన్నకున్నాయి. ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన అనేక మీడియా సంస్థలు ఆదివారం రాత్రి పొద్దుపోయాక రామన్న గుండెపోటుతో మృతి చెందినట్లు బ్రేకింగ్ వార్తలు ప్రసారం చేశాయి. కొన్ని వెబ్ సైట్లు కూడా వార్తా కథనాలను ప్రచురించాయి. అయితే సుమారు అర గంట వ్యవధి తర్వాత ఆయా రాష్ట్రాల ప్రసార మాధ్యమాలు రామన్నకు సంబంధించిన వార్తలను అకస్మాత్తుగా నిలిపివేయడం గమనార్హం.

మావోయిస్టు కీలక నేత రామన్న గుండెపోటుతో మరణించారనే అంశంపై ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సోమవారం ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోని మల్కనగిరి, తూర్పుగోదావరి, గడ్చిరోలి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, దంతెవాడ, బీజాపూర్, నారాయాణపూర్, కాంఖేడ్, జగదల్పూర్, సుక్మా, రాజ్ నంద్ గావ్ తదితర జిల్లాలకు చెందిన పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

రామన్న గురించి తెలంగాణా టుడే వెబ్ సైట్లో తాజా కథనం

ఎందుకంటే ఆయా రాష్ట్రాలతో కూడుకున్న దండకారణ్యంలో మావోయిస్టు దళాలకు నాయకత్వం వహిస్తున్న రామన్న భౌతికి స్థితి అందరికన్నా ఆయా జిల్లాల పోలీసులకే ఇప్పడు అత్యవసరం. ఇందులో భాగంగానే రామన్న గుండెపోటుతో మరణించాడనే ప్రచారాన్ని ధృవపర్చుకోవడానికి తమ నిఘా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా రంగంలోకి దించాయి. అయితే నిన్నటి వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు జరిగిన నేపథ్యంలో అడవుల్లోకి అడుగు మోపే పరిస్థితి లేదని తెలుస్తోంది. రామన్నకు గుండెపోటు వార్తను ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థలు సుక్మా జిల్లా కేంద్రంగా వార్తలను ప్రసారం చేశాయి. దీంతో రామన్న కదలికలు సుక్మా అటవీ ప్రాంతంలోనే ఉండవచ్చని సరిహద్దు జిల్లాల పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న పోస్ట్ ఇదే

ఈ నేపథ్యంలోనే భద్రాద్రి-కొత్తగూడెం ఎస్పీ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ ఒకటి చక్కర్లుకొడుతోంది. రామన్నమరణించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని, పూర్తి వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే భద్రాద్రి-కొత్తగూడెం పోలీసుల పేరుతో చేసిన ఈ పోస్ట్ ను వాట్సాప్ గ్రూపు నుంచి కొద్ది నిమిషాల్లోనే డిలీట్ కావడం గమనార్హం. కానీ అప్పటికే ఈ పోస్ట్ అనేక వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ రూపంలో వెళ్లిపోయింది.

రామన్నమరణించినట్లు పోలీసు వర్గాలు గట్టిగానే చేస్తున్నవాదనపై మరోవైపు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రామన్న జీవించే ఉన్నారా? గుండెపోటుతో మరణించారా? అనే విషయాన్ని మావోయిస్టు పార్టీ స్వయంగా ప్రకటిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Comments are closed.

Exit mobile version